ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో 23 స్థానాలు ఎగబాకిన భారత్‌

సులభతర వ్యాపార నిర్వహణ(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో భారత్‌ సత్తా చాటింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు సంబంధించి ఈ ఏడాది ప్రపంచ బ్యాంక్‌ విడుదల చేసిన జాబితాలో భారత్‌ 77వ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. గతేడాదితో పోల్చితే భారత్‌ 23 స్థానాలు ఎగబాకింది. గతేడాది కూడా భారత్‌ ఈజ్ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 100వ స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

 గత నాలుగేళ్లుగా వాణిజ్య రంగంలో అమలవుతున్న సంస్కరణల ఫలితంగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భారత్‌ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఈ ర్యాకింగ్స్‌కు ప్రపంచ బ్యాంక్‌ 10 అంశాలను పరిగణలోకి తీసుకుంటుండగా, వాటిలో 6 అంశాల్లో భారత్‌ వృద్ధి కనబరిచింది. 190 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి, ఈ నివేదికను ప్రపంచ బ్యాంకు రూపొందించింది.

గతేడాదిలాగే, ఈ సంవత్సరం కూడా భారత్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో వృద్ధి సాధిస్తున్న టాప్‌ 10 దేశాల్లో స్థానం దక్కించుకుంది. అదే విధంగా దక్షిణాసియా దేశాల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని సాధించింది. రెండేళ్ళలో 53 స్థానాలు మెరుగుపడటం విశేషం. మరోవైపు బ్రిక్స్ దేశాల్లో మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఈ స్థాయిలో మెరుగుదల సాధించిన ఏకైక పెద్ద దేశం మనదే. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఆ దిశలో పలు సంస్కరణలు కూడా ప్రవేశపెట్టారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ భారతదేశం చెప్పుకోదగ్గ ప్రగతి సాధించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి దృఢ చిత్తంతో కృషి చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై మోదీ బుధవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో పారిశ్రామికాభివృద్ధికి తగిన వాతావరణాన్ని ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

‘‘భారతదేశం‘ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంక్‌లో మరోసారి మెరుగుదల రావడం పట్ల సంతోషంగా ఉంది. పరిశ్రమలు, పెట్టుబడులు, అవకాశాలను వృద్ధి చేసే వాతావరణాన్ని ప్రోత్సహించే ఆర్థిక సంస్కరణల పట్ల దృఢంగా కట్టుబడిఉన్నాం’’ అని మోదీ ట్వీట్ చేశారు.

కాగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్-50లోకి భారతదేశం చేరగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. కొన్ని రంగాల్లో మెరుగుదల సాధిస్తే భారతదేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్-50లోకి చేరగలదని చెప్పారు. రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్, వ్యాపారాన్ని ప్రారంభించడం, కాంట్రాక్టులను అమలు చేయడం - ఈ మూడింటిలో మెరుగుపడితే మన దేశం ఈ లక్ష్యాన్ని సాధిస్తుందని పేర్కొన్నారు.

దివాలా పరిష్కారం, పన్నుల వ్యవస్థ వంటివి కూడా మెరుగుపడాలని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబంధనల సాకుతో పనుల ఆలస్యమవుతుండటాన్ని, అవినీతిని తగ్గించినట్లు చెప్పారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారతదేశం ర్యాంకును మెరుగుపరిచిందని వెల్లడించారు.