ఆపరేషన్ గరుడపై ఆత్మరక్షణలో చంద్రబాబు !

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలలో ఇప్పుడు `ఆపరేషన్ గరుడ’ పెను దుమారం రేపుతున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకత్వంలోని ఎన్డియేలో భాగస్వామిగా ఉన్న సమయంలోనే ఆయన ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం బీజేపీ నాయకత్వం ఒక కుట్ర పన్నినదని, అదే `ఆపరేషన్ గరుడ’ అని, మే లో కర్ణాటక ఎన్నికలు ముగియగానే దాని అమలు ప్రారంభం అవుతుందని అంటూ చిన్నపాటి సిని నటుడు శివాజీ ఒక ప్రకటన చేసారు. అప్పట్లో ఆ ప్రకటనను ఎవ్వరూ పట్టించుకోలేదు. తీవ్రంగా తీసుకోలేదు.

అయితే కొద్ది రోజులకే చంద్రబాబు నాయుడు ఎన్డియే నుండి నిష్క్రమించడం, కేంద్రంపై పోరాటంకు సై అంటూ తరచూ విమర్శలు చేస్తుండటం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆయనకు ఏ సమస్య ఎదురైనా అదిగో తాను `ఆపరేషన్ గరుడ’లో చెప్పిన్నట్లే జరుగుతున్నదని అంటూ శివాజీ ప్రకటనలు చేస్తుండటం జరుగుతున్నది.

మహారాష్ట్రలోని ధనబాద్ లో గత ఎన్నికల ముందు కాంగ్రెస్ హయంలో నమోదైన కేసు ఒకదానికి సంబంధించి మజిస్త్రేట్ యధాలాపంగా హాజరు కాని నిందితుల పేర్లతో వారంట్లు జారీ చేస్తే, అది కుడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జారి చేయించారని, చంద్రబాబును అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారని అంటూ గగ్గోలు పెట్టారు.

అయితే ఆ మరుసటి నెలలోనే చంద్రబాబు అసలు కోర్ట్ కు వెళ్ళకుండా, న్యాయవాది ద్వారా ఆ వారెంట్ ను ఉపసంహరింప చేసుకో గలిగారు. కాని అప్పుడు మోదీగారిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా అట్లా చేయగలిగారని చెప్పలేదు. అట్లాగే పన్ను ఎగవేత దారులపై ఈడి, ఐటి అధికారులు దాడులు చేస్తున్నా చంద్రబాబు లక్ష్యంగా చేస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఆర్ధిక నేరస్తులకు తాను `రక్షణ’ కల్పిస్తున్నట్లు చంద్రబాబు అంగీకరిస్తున్నారా అనే అనుమానం ఈ సందర్భంగా కలుగుతున్నది.

ఈ లోగా విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఒక యువకుడు దాడి జరిపితే ఆ పేరుతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించడం కోసం బీజేపీ పన్నిన కుట్ర అంటూ మరోసారి గగ్గోలు పెడుతున్నారు. `ఆపరేషన్ గరుడ’ ప్రకారం జరిగిన్నట్లు కుడా ప్రచారం చేస్తున్నారు.

ఇప్పటి వరకు కేవలం టిడిపి మంత్రులు, నేతలు మాత్రమె `ఆపరేషన్ గరుడ’ గురించి మాట్లాడుతున్నారు. మొదటి సారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహితం దీని గురించి ప్రస్తావించారు. మొదట్లో తానూ నమ్మలేదని, ఇప్పుడు అంతా దాని ప్రకారమే జరుగుతూ ఉంటె నమ్మలేక తప్పడం లేదంటూ పేర్కొన్నారు.

ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్న రాజకీయ నేత అయినా మరో ఆరు నెలలో ఎన్నికలు వస్తుండగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చివేసి, ప్రజలలో సానుభూతి పొందే అవకాశం కల్పిస్తారా ? ఎటువంటి ఆధారం లేకుండా, దేశంలోనే, ప్రధాని మోదీ కన్నా సీనియర్ నేతను అని చెప్పుకొనే చంద్రబాబు ఇటువంటి ప్రచారాలుకు దిగడం కేవలం తన పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్ళించడం కోసమే అని భావించ వలసి వస్తున్నది.

పోలవరం నీళ్ళని, అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని అని, రెండు కోట్ల ఎకరాలకు సాగు నీరని, ఇంటికో ఉద్యోగం అని, రైతుల ఆదాయం రెట్టింపు అని, కాపులకు రిజర్వేషనలు అని... ఈ విధంగా ఎన్నో అందమైన కలలను ప్రజల ముందు ఉంచుతూ వస్తున్నారు. అయితే అవేమే నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ప్రజల దృష్టిని వాటి నుండి మళ్ళించడం కోసం, మీరేమి చేసారని అడిగే అవకాశం లేకుండా చేయడం కోసం ఎదురు దాడులు చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.

ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే కనీసం పలుకరించి, సానుభూతి తెలిపి, మంచి చెడులు అడిగి తెలుసుకొనే కనీసం మర్యాద చూపని ముఖ్యమంత్రి, మొత్తం విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చూస్తుంటే విస్మయం కలిగిస్తున్నది. ప్రతిపక్ష నేతల కదలికలపైననే కాకుండా సొంతపార్టీ వారి కదలికలపై కూడా నిత్యం నిఘా వేస్తూ, తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న బలమైన నిఘా విభాగం, దేశంలోనే పెద్ద పోలీస్ వ్యవస్థలలో ఒకటి తన అధీనంలో ఉండగా ఎవ్వరో ఎటువంటి ఆధారం లేని వ్యక్తి `ఆపరేషన్ గరుడ’ అని చెబుతూ ఉంటె కళ్ళప్పగించి చూస్తుంటారా ?

తన సొంత నిఘా విభాగాలు, నేర పరిశోధన విభాగాలతో దర్యాప్తు చేసి ఉండవచ్చు. శివాజీని పిలిచి ఎందుకు మీ పోలీసులు దర్యప్తు జరపడం లేదని ఢిల్లీలో జరిపిన మీడియా సమావేశంలో ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి తడబాటుకు గురయ్యారు. పొంతనలేని సమాధానం చెప్పారు. `ఆపరేషన్ గరుడ’ అని గత మార్చ్ లో శివాజీ ప్రకటన చేసినప్పుడే దానిపై దర్యాప్తు జరిపించమని రాష్ట్రంలో ప్రతిపక్షాలు అన్ని డిమాండ్ చేస్తే నోరు మెదపనే లేదు. అప్పటికే ఎన్డియేలో భాగస్వామిగా ఉన్న ఆయన నేరుగా ప్రధనినో, కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ నో విచారణ జరిపించమని కోరి ఉండవచ్చు. అటువంటి ప్రయత్నం చేయనే లేదు.

ఇంతటి భారీ యంత్రాంగం పెట్టుకొని ఎవ్వరో ఒక వ్యక్తి, ఎప్పుడో చెప్పిన కధనాలను ఆధారాలుగా తీసుకోవలసిన అవసరం ముఖ్యమంత్రికి ఎందుకు కలుగుతున్నది ? తన యంత్రాంగాన్నే తాను విశ్వాసం లోకి తీసుకోలేక పోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఈ సాకుతో కేంద్రంపైననే తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉండడంతో `ఆపరేషన్ గరుడ’ కధ ఏమిటో తేల్చవలసిన బాధ్యత కేంద్ర నిఘా సంస్థలపై పడింది. అయితే అందమైన కధనాలు అల్లి వదిలి వెళ్ళిన శివాజీ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఎన్నికల లోపు తిరిగి రాక పోవచ్చని కూడా అంటున్నారు. అంటే డిటెక్టివ్ కదా వలే రాజకీయ ప్రయోజనాలకోసం ఈ కధనాన్ని వాడుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.

మరోవంక తమ నేత పై జరిగిన దాడి గురించి ఏపీ పోలిసుల దర్యాప్తులో తమకు నమ్మకం లేదని, కేంద్ర దర్యప్తు సంస్థలతో చేయించాలని వైసిపి నేతలు కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ ను కలసి కోరితే టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారు రాష్ట్ర పోలిసుల పట్ల అపనమ్మకం ప్రకటించడం గతంలో జరగలేదా ? గతంలో వై ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిడిపి నేత పరిటాల రవీంద్ర హత్యా జరిగితే చంద్రబాబు నాయుడు స్వయంగా ఇటువంటి ఆరోపణలను అసెంబ్లీ సాక్షిగా చేయలేదా ? అప్పుడు సిబిఐ దర్యాప్తుకు రాజశేఖరరెడ్డి ఒప్పుకోక తప్పలేదు గదా ?

ఇప్పుడు ఐటి దాడులన్నా, సిబిఐ దర్యప్తు అన్నా చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారు అంటే తమ `ఘనకార్యాలు’ అన్ని ఎక్కడ బయట పడతాయి అని భయపడుతున్నట్లు భావించ వలసి వస్తుంది.