ఇరకాటంలో కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్ !

గత ఎన్నికల ముందే రాజకీయ వాతావరణం గమనించి తెలుగుదేశం నుండి టిఆర్ఎస్ లో చేరి లోక్ సభకు ఎన్నిక కావడం, ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్. టి రాజయ్యను అనూహ్యంగా `అవినీతి’ ఆరోపణలతో పదవి నుండి తొలగించి, ఆ పదవిని చేపట్ట గలగడం ద్వారా ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా మారిన కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్ ప్రస్తుత ఎన్నికలలో మాత్రం ప్రతికూలత  ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తున్నది. మొన్నటి వరకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇప్పుడు ముఖం తప్పేస్తూ ఉండడంతో ఇమడలేని పరిస్థితులు నేలకొంటున్నాయి.

ఒక వంక ఇంటి పోరు, మరో వంక బయటి పోరుతో ఇరకాటంలో చిక్కుకున్నట్లు స్పష్టం అవుతున్నది. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం కోసం పట్టు పడుతున్న కుమార్తె డాక్టర్. కడియం కావ్యకు సీట్ ఇప్పించ లేకపోవడం, ఈ విషయమై ఎన్ని విధాలుగా ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్న కెసిఆర్ లెక్కించక పోవడంతో దిక్కు తోచని పరిస్థితులలో చిక్కుకున్నారు.

ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించి ఆ పదవిని పొందినంత సులభంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నుండి గత ఎన్నికలలో ఎన్నికైన డాక్టర్. తాటికొండ రాజయ్యకు తిరిగి సీట్ ఇవ్వకుండా కుమార్తెకు ఇప్పించు కోవడం కోసం వ్యూహాత్మకంగా రంగం సిద్దం చేసుకొంటూ వచ్చారు. ఆ నియోజకవర్గంలో రాజయ్యకు వ్యతిరేకంగా బలమైన వర్గాలను సిద్దం చేసారు. అయితే మాట మాత్రం కూడా చెప్పకుండా కెసిఆర్ ఒకేసారి 105 సీట్లకు అభ్యర్ధులను ఖరారు చేయడంతో కడియం వంటి వారు ఖంగు తిన్నారు. ప్రకటించిన తర్వాత రాజయ్య అభ్యర్ధిత్వాన్ని రద్దు చేయించి, కావ్యకు సీట్ ఇప్పించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలిన్చాలేనే లేదు.

చివరకు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనే హెచ్చరికలు కూడా చేరాయి. పైగా రాజయ్య గెలుపుకు హామీ ఇవ్వమనే వత్తిడులను ఎదుర్కొన వలసి వస్తుంది. అప్పట్లోనే ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత లోక్ సభ సీట్ కు కడియం రాజీనామా చేయగానే ఉపఎన్నికలలో పార్టీ అభ్యర్ధిత్వాన్ని కావ్య ఆశించారు. అప్పుడే తొలిసారి ఆశాభంగం కలిగింది.

ప్రస్తుతం కడియం, తాటికొండ కలసి పనిచేస్తున్నామని చెప్పుకొంటున్నా ఆచరణలో మాత్రం ప్రభావం కనిపించడం లేదు. కెసిఆర్ వ్యవహారశైలి పట్ల కినుక వహించిన కడియం చాలారోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉన్నారు. పార్టీ పరంగా ఇద్దరు కలసి ప్రచారం చేసే విధంగా నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ అధర్యంలో పనిచేయాలని అనుకున్నా ఆచరణలో ఎవ్వరి దారి వారిదిగా ఉంది.

ఇప్పుడు కడియం పరిస్థితి రెండికి చెడిన రేవడి వలే ఉంది. రాజయ్య ఓటమి చెందితే అందుకు తానే బాధ్యత వహించ వలసిన పరిస్థితులు నెలకొన్నాయి. రాజయ్య గెలుపొందినా తనకు పార్టీలో, ప్రభుత్వంలో తిరిగి పూర్వ వైభవం దక్కుతుందా అనే అనుమానాలు ఆయనను వెంటాడుతున్నాయి.

సీట్ దక్కక పోవడంతో తీవ్రం అసహనానికి గురవుతున్న డాక్టర్. కావ్య ఎట్లాగైనా సరే పోటీ చేయాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకోసం కాంగ్రెస్, బిజెపి వర్గాలకు సీట్ ఇస్తే ఆయా పార్టీల అభ్యర్ధులుగా పోటీ చేయడానికి సిద్దం అనే సంకేతం పంపిన్నట్లు తెలిసింది. అయితే సానుకూల స్పందన లభించక పోవడంతో మౌనంగా ఉండవలసి వస్తుంది. ఒక వేళ ఆమె పార్టీ మారితే కడియంకు ఇక్కడ నూకలు చేల్లిన్నట్లే అని అధికార పార్టీ వరాలు వ్యాఖ్యానిస్తున్నాయి.