ఆపరేషన్‌ గరుడపై విచారణ కోరిన ఏపీ బిజెపి

ఆపరేషన్‌ గరుడ వెనుక ఉన్నది ఎవరో నిగ్గు తేల్చాలని, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఏపీ బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడి అంతా ఆపరేషన్‌ గరుడలో భాగమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంతో ఈ అంశంపై లోతయిన విచారణ జరపాలని కోరారు.

సినీ నటుడు శివాజీ గతంలో ఆపరేషన్‌ గరుడ గురించి మీడియాకు వివరించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్‌ గరుడపై విచారణ జరపాలని, తిత్లీ తుపానుతో నష్టపోయిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రిని బీజేపీ నేతలు కోరారు.

అనంతరం ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్‌ గరుడ అనేది టీడీపీ సృష్టేనని, దీనిపై నిజానిజాలు వెలికితీయాలని రెండు నెలల కిందటే ఫిర్యాదు చేసినా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించిందని విమర్శించారు. వైఎస్‌ జగన్‌పై దాడి జరుగుతుందని రెండు నెలల కిందటే చెప్పిన వ్యక్తిని సాక్షిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. నటుడు శివాజీని భద్రత బలగాలు అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్‌ చేశారు.

సీఎంపైనే దాడి జరుగుతుందని రెండు రోజుల కిందటే చెప్పినా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. చార్జిషీట్‌లో శివాజీ పేరు లేకుండాచేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని మండిపడ్డారు.

కడప ఉక్కు పరిశ్రమ రాకుండా అడ్డుపడిన టీడీపీకి ధర్మపోరాట దీక్ష చేసే హక్కులేదని ఎద్దేవా చేశారు. తిత్లీ సహాయక చర్యలను ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనదే కనబడుతోందని ఆరోపించారు.