శబరిమల దర్శింపనున్న అమిత్ షా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చే నెలలో శబరిమల ఆలయాన్ని సందర్శించనున్నారు. నవంబర్‌ 17 నుంచి శబరిమలలో వార్షిక యాత్ర ప్రారంభమవనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి పూజలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న నిరసనకారులకు తమ పార్టీ మద్దతు తెలుపుతుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.

 ‘శబరిమల ఆలయాన్ని సందర్శించాలని అమిత్‌ షా అన్నారు. అయితే ఇప్పటి వరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని కేరళ బీజేపీ విభాగ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. శబరిమల నిరసనకారులపై సీఎం పినరయి విజయన్‌ కఠినంగా వ్యవహరించడంపై గత వారం అమిత్‌ షా రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని గత వారం కేరళ పర్యటన సందర్భంగా విమర్శించారు.

నిరసనకారులపై దాడులు ఆపకపోతే బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కాగా, పోలీసులు ఇప్పటి వరకు 3,500 మంది నిరసనకారులను అరెస్టు చేశారు. అక్టోబర్‌ 17 నుంచి 22 మధ్య నెలవారీ పూజలు నిర్వహించిన సమయంలో డజను మంది మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు.