ప్రజా నిరసనలతో ఆత్మరక్షణలో కెసిఆర్ !

గడువు వరకు ఆగి లోక్ సభ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభంజనంలో కొట్టుకు పోతామనే భయంతో ముందుగానే ఎన్నికలకు సిద్దపడిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావులో ఎన్నికలు సమీపించే కొది వణుకు పుడుతున్నట్లు స్పష్టం అవుతున్నది. ఇప్పటికి తెలంగాణాలో తమ పార్టీఏ ఆధిక్యతలో ఉన్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొది పరిస్థితులు వేగంగా మారుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది.

టీఆర్ఎస్ మంత్రులు, అభ్యర్ధులు ప్రచారం కోసం ఎక్కడకు వెళ్ళినా ప్రజల నుండి నిరసనలు ఎదురు కావడం, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల గురించి నిలదీస్తూ ఉండడంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడుతున్నది. కనీసం 30 నియోజక వర్గాలలో అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పలు చోట్ల ప్రజలకు సమాధానాలు చెప్పలేక వేనుతిరిగి రావలసి వస్తున్నది. ఎంతగా బుజ్జగించినా సీట్ రాక తిరుగుబాటు ధోరణులు ప్రదర్శిస్తున్న నేతలు దారికి రావడం లేదు.

స్వయంగా కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని పరిస్థితులే అధికార పక్షానికి ఆందోళన కలిగిస్తున్నాయి. స్థానిక నేత‌లు వ‌ర‌స పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి చేర‌టం..మ‌ళ్లీ వెంట‌నే వారిని ఏదో ఒక ర‌కంగా పార్టీలోకి తీసుకురావ‌టం. ఇలా జ‌రుగుతోంది. తాజాగా గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన, ప్ర‌స్తుతం రాష్ట్ర రోడ్డు డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే న‌ర్సారెడ్డి పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

స్థానిక నేత‌ల్లో పార్టీ అధినేత‌ కెసీఆర్ పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతుండ‌టంతో ఎన్నిక‌ల ఫలితం ఎలా ఉండ‌బోతుందా? అన్న టెన్ష‌న్ పార్టీ నేత‌ల్లో ఉంది. త‌మ‌కు పార్టీ నాయ‌క‌త్వం నుంచి క‌నీస గౌర‌వం ద‌క్క‌లేద‌ని..గుర్తింపు ఉండ‌టంలేద‌ని స్థానిక నాయ‌కులు వాపోతున్నారు. కెసిఆర్ ఎక్కువ రోజులు ఇక్కడున్న ఫార్మ్ హౌస్ లోనే ఉంటున్నా స్థానిక నాయకులు ఎవ్వరిని దగ్గరను రానీయక పోవడం ప్రధానంగా ఈ అసంతృప్తికి కారణంగా కనిపిస్తున్నది.

తాము అమలు చేసిన పధకాలు, కార్యక్రమాలే ఓట్లు తెచ్చి పెడతాయని మొదట్లో ధీమాగా ఉన్న నేతలు ఇప్పుడు మరోసారి ప్రజలలో సెంటిమెంట్లను రగిలిస్తే తప్ప గెలవలేమని ఆందోళన పట్టుకోంది. అందుకనే మొత్తం 119 స్థానాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 15 సీట్లకు మించి పోటీ చేయలేని టిడిపి మహాకూటమి అధికారంలోకి వస్తే హోం, నీటిపారుదల శాఖ అడుగుతుందని హరీష్ రావు ప్రకటించటం వెనక ఉద్దేశ్యం అదే అని స్పష్టం అవుతుంది. మహాకూటమి అధికారంలోకి వస్తే పరిపాలన అంతా అమరావతి నుండి జరుగుతుందని అంటూ పరోక్షంగా మరో సారి `ఆంధ్ర వాళ్ళ’ పాలన కిందకు తెలంగాణ పోతుందనే భయం కలిగించడం కోసం కేటిఆర్ సహితం ప్రయత్నం చేస్తున్నారు.

వారిద్దరి మాటలే పరోక్షంగా కూటమికే ఛాన్స్ ఉందనే సంకేతాలు పంపడం ద్వారా ప్రజలలో భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా వారి ప్రకటనలు రాష్ట్రంలో తమ పలానకు చివరి రోజులు దగ్గరయ్యాయనే సంకేతం పంపుతున్నట్లు అవుతున్నది. అధికారంలో ఉన్న నాలుగున్నర సంవత్సరాల్లో ఏ రోజూ ప్రతిపక్షాలు చెప్పిన మాటలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకొననే లేదు.  కొత్త సచివాలయం ఎందుకంటే…ప్రజలు మాకు తీర్పిచ్చారు మా ఇష్టం అని సీఎం కెసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇచ్చారు.

కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు అనుక్షణం పాలనకు అడ్డుపడటం వల్లే ముందస్తుకు వెళుతున్నామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి అంశంలోనూ ప్రతిపక్షాలను బుల్డోజ్ చేసిన టీఆర్ఎస్ నేతలు ఇఫ్పుడు ఎన్నికలకు ప్రతిపక్షాలే కారణం అన్నట్లు వ్యాఖ్యానించటం చూస్తుంటే ఆ పార్టీ నేతలు కలవరానికి గురవుతున్నట్లు వెల్లడి అవుతున్నది. నిత్యం తాము వందకు పైగా సీట్లు గెల్చుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నా మారి మాటలలో అటువంటి భరోసా కనిపించడం లేదు. అధికార పార్టీ నుంచి సాగుతున్న వలసలు కూడా ఆ పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి.