ఆపరేషన్ గరుడపై దర్యాప్తు జరిపించాలి

ఆంధ్రాలో జరుగుతున్న దారణ పరిస్థితులు, దిగజారుతున్న శాంతి భద్రతలపై దృష్టిసారించాలని ఏపీ బీజేపీ నేతలు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ గరుడ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, శివాజీని కస్టడీలోకి తీసుకుని ఆయనను విచారించాలని వారు కోరారు. రాష్ట్రంలో పార్టీల అగ్రనేతలపై జరిగిన దాడుల విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు

మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల, ఐవైఆర్ కృష్ణారావు, రమేష్‌నాయుడు తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఏపీలో రోజురోజుకూ శాంతి భద్రతలు లోపించాయని గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరిగిందంటే ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోందని వారు గుర్తు చేసారు.

గత నాలుగున్నరేళ్లుగా ఆంధ్రాలో యువతకు ఉపాధి అవకాశాలు లేక దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయని, నిరాశకు లోనైన యువత భవిష్యత్‌ను సమీక్షించాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు.

గతంలో అమిత్ షాపైనా, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై కూడా దాడులు జరిగాయని నాయకులు అందరిపై దాడులు జరుగుతుంటే అక్కడ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని వారు ప్రశ్నించారు. అది కాస్తా ముదిరి ఏకంగా విపక్ష నేతపైనే దాడి జరిగే పరిస్థితి వచ్చిందంటే శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్ధం అవుతోందని వారు వివరించారు.

ఆపరేషన్ గరుడ పేరుతో ఏదో కుట్ర జరుగుతోందని పదే పదే చెబుతున్న శివాజీపై విచారణ జరిపించాలని, పబ్లిసిటీ కోసమే దాడి చేశారని డీజీపీ వ్యాఖ్యానించడం చాలా అభ్యంతరకరమని పేర్కొన్నారు. దీనిపైనా విచారణ జరిపించాలని బీజేపీ బృందం డిమాండ్ చేసింది. జగన్‌పై దాడి కేసును సీబీఐకి అప్పగించాలని వారు పేర్కొన్నారు. డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడిగే హక్కు గవర్నర్‌కు ఉందని, గవర్నర్ శాంతి భద్రతలను తెలుసుకోవల్సిన అవసరం ఉంటుందని, ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడంపై ఏపీ సీఎం అభ్యంతరం చెప్పడం సరికాదని వారు స్పష్టం చేసారు.