ప్రధాని ప్రసంగంపై పారిశ్రామిక వర్గాల ప్రశంస

ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల సరసన భారత్‌ను నిలబెడుతామన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశ్వాసంపై దేశీయ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  చారిత్రక ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై భారతీయ వ్యాపార, పారిశ్రామిక వర్గాలు ప్రశంసలు కురిపించాయి.  ప్రగతిదాయక ప్రసంగాన్ని ఇచ్చారని కొనియాడాయి. వృద్ధిపై విశ్వాసం పెరిగిందని పేర్కొన్నాయి.

తమ ప్రభుత్వం గత నాలుగేండ్లలో నిర్మాణాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టిందని, దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడిందన్న మోదీ భారత్ వృద్ధిరేటు పరుగులు పెట్టడం ప్రారంభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆదాయం రెండింతలు చేయడానికి కృషి చేస్తున్నామన్న ఆయన మత్స్య తదితర కొత్త రంగాలతో వ్యవసాయ రంగాన్ని విస్తరిస్తున్నామని చెప్పుకొచ్చారు.

వృద్ధికి ఊతమిచ్చే నిర్ణయాలపై రాజీపడబోమన్న సంకేతాలు ప్రధాని ప్రసంగంలో స్పష్టంగా కనిపించాయని సీఐఐ అధ్యక్షుడు రాకేశ్ భారతీ మిట్టల్ తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవంసహా వివిధ రంగాల్లో భారత్ వైభవానికి ఢోకా లేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్యం కోసం ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య అభియాన్ సౌకర్యాన్ని వచ్చే నెల 25 నుంచి అమల్లోకి తేనున్నామని మోదీ చేసిన ప్రకటనపట్ల కూడా మిట్టల్ ఆనందం వ్యక్తం చేశారు. దీన్ని ఓ గొప్ప మైలురాయిగా అభివర్ణించిన ఆయన జాతికి లభించిన బహుమతిగా అభిప్రాయపడ్డారు. 50 కోట్ల మందికి దీనివల్ల నాణ్యమైన వైద్యసదుపాయం దరిచేరగలదని చెప్పారు.

నిజంగా పేదలకు ఇది గొప్ప వరంగా పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దేశం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న బహుమతిని మోదీ అందించారని హెల్త్‌కేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి అంజన్ బోస్ ఆనందం వ్యక్తం చేశారు. ఇకపోతే నిర్మాణ రంగ నియంత్రణ వ్యవస్థ (రెరా), దివాలా చట్టం (ఐబీసీ), వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వంటి పలు కీలక సంస్కరణలను గడిచిన కొన్నేండ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్నదని ఫిక్కీ అధ్యక్షుడు రాశేష్ షా గుర్తుచేశారు.

ప్రస్తుతం ఈ సంస్కరణల ఫలాలు అందడం మొదలైందన్న ఆయన ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంలో భారత్‌కు సమున్నత స్థానం కల్పించడానికి ప్రధాన మోదీ దృఢమైన పరిష్కారాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.  సంస్కరణల ఫలితాలు భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయగలవన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న దాఖలాలున్నాయని పేర్కొన్నారు. రాబోయే కొన్నేండ్లలో 8 శాతానికిపైగా వృద్ధిరేటును అందుకోగలదన్న విశ్వాసాన్ని కనబరిచారు.

జన్ ఆరోగ్య అభియాన్‌ను అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి స్వాగతించారు. కోట్లాది మంది భారతీయులకు ముఖ్యంగా కనీస వైద్య సదుపాయాల్ని అందుకోలేని నిరుపేదలకు ఇది ఓ వరమని అభిప్రాయపడ్డారు. దేశీయ హెల్త్‌కేర్ చరిత్రలోనే ఇదో గొప్ప నిర్ణయంగా పేర్కొన్నారు. దీనికి తమ వంతు సహకారం తప్పక ఉంటుందన్న భరోసానిచ్చారు.

పేదలు, ప్రధానంగా గ్రామీణ కుటుంబాలు, పట్టణాల్లో కులవృత్తులపైనే జీవనం సాగిస్తున్నవారి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.10,000 కోట్ల నిధులను కేటాయించిన కేంద్రం.. సెప్టెంబర్ 25 నుంచి మొదలయ్యే ఈ పథకంలో భాగంగా గ్రామాల్లో 8.03 కోట్లు, పట్టణాల్లో 2.33 కోట్ల మంది పేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల కవరేజీని ఇవ్వనున్నది.