గ్లోబల్ బ్రాండ్‌గా మారిన ‘మేక్ ఇన్ ఇండియా’

‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని, అదొక గ్లోబల్ బ్రాండ్‌గా అవతరించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన రెండో రోజు టోక్యోలో ప్రవాసభారతీయులతో సమావేశమైన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సృజనాత్మక విషయంలో భారత్ ప్రపంచ అగ్రదేశంగా అవతరించిందని, స్టార్టప్స్‌కు అనుకూలమైన వాతావరణం ఉన్న దేశాల్లో రెండోదిగా భారత్ నిలిచిందని చెప్పారు.

భారత్‌లో ఒక చిన్న కూల్ డ్రింక్ ధరతో పోలిస్తే.. 1 జీబీ డాటా ధర చాలా చవకని ప్రధానమంత్రి తెలిపారు. సేవలు అందించడంలో ఈ డాటా చాలా ఉపయోగకారిగా ఉంటుందని చెప్పారు. డిజిటల్ మౌలిక వసతుల కల్పనలో భారత్ అపార పురోభివృద్ధి సాధించిందని, గ్రామాలకు బ్రాండ్‌బ్యాండ్ సౌకర్యం లభించిందని, దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్స్ వినియోగంలో ఉన్నాయని పేర్కొన్నారు. భారత్‌లో టెలీకమ్యూనికేషన్స్-ఇంటర్నెట్ వ్యవస్థలు శరవేగంగా విస్తరిస్తున్నాయంటూ ప్రశంసించారు.

అత్యంత మన్నికైన వస్తువులను కేవలం భారత్ కోసమే కాకుండా ప్రపంచం కోసం కూడా ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్స్, ఆటోమోబైల్ తయారీ రంగంలో భారత్ ప్రపంచ హబ్‌గా మారిందని ప్రధాని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే తొలిస్థానం సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా గత ఏడాది ఇస్రో శాస్త్రవేత్తలు ఒకేసారి 100 ఉపగ్రహాలను ప్రయోగించిన విషయాన్ని మోదీ ఉదహరించారు. 

అతి తక్కువ వ్యయంతో చంద్రయాన్, మంగళ్‌యాన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వెల్లడించారు. 2022నాటికి గగన్‌యాన్‌ను ప్రయోగించనున్నామని, ఈ ప్రయోగం ద్వారా భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపనున్నామని చెప్పారు. భారత్ అభివృద్ధిలో జపాన్‌లోని ప్రవాస భారతీయులు భాగస్వాములవ్వాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మార్షల్ ఆర్ట్స్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే జపాన్‌లో కబడ్డీ, క్రికెట్‌ను ప్రవేశపెట్టడంలో ప్రవాస భారతీయులు కృషి ఎనలేదనిదని ప్రశంసించారు.

జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఆ దేశ ప్రధాని షింజో అబేతో ప్రతినిధుల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ఆదివారం మోదీ-అబే సుమారు 8 గంటలపాటు అనధికారికంగా సమావేశమైన విషయం తెలిసిందే. మరుసటి రోజు సోమవారం వారు అధికారికంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ రంగం, ప్రాంతీయ భద్రత అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు. భారత్-జపాన్ సంబంధాల్లో సరికొత్త ఒప్పందం కుదిరింది. యోగా, ఆయుర్వేదంలో పరస్పరం సహకరించుకోవాలని రెండు దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్- కనగవా రాష్ట్రం మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ సమక్షంలో ఈ ఒప్పందం కుదరడం విశేషం. ఈ ఒప్పందం మేరకు ‘నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్’ అమలులో జపాన్ సహకారం అందిస్తుంది.