ఆరు నెలల్లో చంద్రబాబు పోతుండగా రాష్ట్రపతి పాలన ఎందుకు ?

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేసారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. ఎలాగో ఆరు నెలల్లో ప్రజలే టీడీపీని ఇంటికి పంపుతారని, ఈ లోగా రాష్ట్రపతి పాలన ఎందుకని  ఎద్దేవా చేశారు.

చంద్రబాబు దిల్లీ వెళ్లి జాతీయ మీడియా ముందు అబద్ధాలు చెప్పారని జీవీఎల్‌ మండిపడ్డారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని అంటూ ఆయన యూటర్న్‌ సీఎం అనే విషయం ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

విశాఖ విమానాశ్రయంలో వైసిపి అధ్యక్షుడు జగన్‌పై జరిగిన దాడి ఘటనలో ఆ పార్టీ నేతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిస్తే టిడిపి నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఆ కేసులో విచారణను తప్పుదోవ పట్టించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జీవీఎల్‌ ఆరోపించారు. జగన్‌పై దాడి రాజకీయ కుట్రే అన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.  అతనిపై దాడి చేసిన వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడనే విషయం ముఖ్యం కాదని, నిందితుడు ఎవరి ప్రేరేపితంతో దాడి చేశాడనేది ముఖ్యమని చెప్పారు.

కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైసీపీ కోరుతుంటే టీడీపీ మాత్రం వద్దనడం దారుణమన్నారు. తన వద్ద అన్ని వివరాలు ఉన్నాయని చంద్రబాబు అంటున్నారని, ఇన్వెస్టిగేషన్ వివరాలు సీఎం వద్ద ఉండటమేంటి? అని ఆయన ప్రశ్నించారు. జగన్‌పై దాడి ఆయన్ను చంపాడానికే అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో రాశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్‌పై దాడి వల్ల ఎవరికి లాభం అనేది విచారణ జరపాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. 

ఐటీ దాడులపై చంద్రబాబు అంతలా ఉలిక్కిపడడం అనుమానాలకు తావిస్తోందని జివిఎల్ విస్మయం వ్యక్తం చేసారు. పన్నులు ఎగ్గొట్టడంతో పాటు అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వారిపై ఐటీ దాడులు జరుగుతాయని చెబుతూ తప్పు చేయకపోతే తెదేపా నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి ఐటీ దాడులపై చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఐటీ దాడులు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించడమేంటని నిలదీశారు. అక్రమార్కులపై ఐటీ దాడులు జరపకపోతే.. అవినీతి చేస్తూ సంపాదించుకోండి అని ప్రోత్సహించాలా? అంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు.