ఖ‌లీదా జియాకు ఏడేళ్ల క‌ఠిన జైలు శిక్ష‌

బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని, బీఎన్‌పీ చైర్‌ప‌ర్స‌న్ ఖ‌లీదా జియాకు ఏడేళ్లే క‌ఠిన కారాగార‌ శిక్ష విధించారు. జియా చారిట‌బుల్ ట్ర‌స్టు అవినీతి కేసులో ఆమెకు ఈ శిక్ష‌ను ఖ‌రారు చేశారు. జియాతో పాటు హారిస్ చౌద‌రికి కూడా ఏడేళ్ల శిక్ష‌ను వేశారు. ఇద్ద‌రికీ ప‌ది ల‌క్ష‌ల జ‌రిమానా కూడా కోర్టు విధించింది.

ప్ర‌ధానిగా ఉంటూ, భర్త పేరుతో ఓ స్వ‌చ్ఛంధ సంస్థ‌ను ఏర్పాటు చేసి, దాని కోసం నిధుల‌ను స‌మీక‌రించి, ఆ త‌ర్వాత ఆ డ‌బ్బును ధైర్యంగా దుర్వినియోగం చేసినందుకు ఖ‌లీదాకు క‌ఠిన శిక్ష విధించాల‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఢాకాలోని స్పెష‌ల్ జ‌డ్జి కోర్టు ఈ తీర్పును వెలువ‌రించింది.

ప్రస్తుతం ఆమె బంగ్లాదేశ్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఓ చిన్నారుల స్వచ్ఛంద సంస్థకు వచ్చిన అంతర్జాతీయ నిధులను 72 ఏళ్ల జియా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో జైలు శిక్ష పడిన ఆమె గత ఫిబ్రవరి నుండి జైలులోనే ఉన్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండడంతో కోర్టుకు హాజరు కాలేదు.