విస్తరిస్తున్న ఆన్‌లైన్ వైద్య సేవలు

వైద్య సేవల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగానవసరం లేదు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని ఇంటి నుండే ఆన్ లైన్ లో వైద్య సేవలు సహితం అందించే కంపెనీలు అవతరించాయి. టెక్నాలజీ దన్నుతో స్టార్టప్ కంపెనీలు ఈ రంగంలోకి వినూత్న ఆలోచనలతో ప్రవేశిస్తున్నాయి. వేగంగా మారుతున్న పట్టణ జీవన విధానంలో దాదాపు సగం వ్యాధులకు మందుల చిట్టి, ఔషధాలే అవసరం లేదు. అలాగే 80 శాతం రోగులకు ఆసుపత్రులలో చేరవలసిన అవసరమే లేదు. కాని ఏ చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినా వివిధ రకాల వైద్య పరీక్షలతో పిండుకోవడం చూస్తూనే ఉన్నాం.

అదేవిధంగా, అనేక లైఫ్ స్టయిల్ వ్యాధులకు నేరుగా డాక్టర్‌ను సంప్రదించాల్సి అవసరం లేకుండా పోయింది. ఈ వాస్తవాలను గుర్తించిన ఎన్‌ఐటీ జంషెడ్‌పూర్, ఐఐఎం లక్నో పూర్వ విద్యార్థి రాహుల్ పెయిథ్ డాక్‌ఆన్‌లైన్ స్టార్టప్ కంపెనీతో అందిస్తున్న వైద్య సేవలకు దేశవ్యాప్తంగా ప్రోత్సాహకర స్పందన లభిస్తున్నది. జూలై 2017 నుంచి హైదరాబాద్ కార్యకలాపాలు ప్రారంభించిన డాక్‌ఆన్‌లైన్ పుణె, బెంగళూరు నగరాలకు కూడా విస్తరించింది. ఈ నెలలో ముంబైలో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నారు. ఇటువంటి ఆన్ లైన్ వైద్యసేవలు అందించే సంస్థలు మనదేశంలో పెరుగుతూనే ఉన్నాయి.

వర్చ్యువల్ హాస్పిటల్‌గా రూపొందించిన ఈ స్టార్టప్ కంపెనీకి స్వీడన్‌కు చెందిన వెంచర్ క్యాపిటలిస్టులు మార్కస్ మోడింగ్, జోహాన్ ఇదిమైర్‌లు భారీ స్థాయిలో నిధులను సమకూర్చారు. దాదాపు 200 మంది డాక్టర్లతో స్థానిక భాషలోనే కన్సల్టేషన్ అందిస్తున్నారు. ఈ కన్సల్టేషన్‌ను ఫోన్‌లో లేదా వీడియో కాల్ ద్వారా నిర్వహించవచ్చు. ఇందుకోసం మొబైల్ యాప్‌ను కూడా రూపొందించారు.

సబ్‌స్క్రిప్షన్ ద్వారా అతి తక్కువ ధరలో వైద్య సేవలను నిపుణుల ద్వారా పొందే అవకాశం వుందని చెబుతున్నారు.  హైదరాబాద్ 50కి పైగా కార్పొరేట్లతో ఒప్పందాలను కుదుర్చుకున్న ఈ స్టార్టప్ కంపెనీ హెల్త్‌కేర్ కోసం 70 వేల మంది సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారని వెల్లడించారు. ముంబై తర్వాత చెన్నై, కోల్‌కతా నగరాలకు కూడావిస్తరించే యోచనలోవున్నట్టు చెబుతున్నారు. ఔట్ పేషేంట్ కేర్ అవసరమైన వారికి మాత్రమే తాము సేవలను అందిస్తున్నామని, వైద్య సేవలకు తోడు న్యూట్రిషన్, వెల్‌నెస్ సేవలను కూడా తమ కంపెనీ అందిస్తున్నట్టు చెప్పారు.