జగన్ పై దాడిలో ప్రధాన కుట్రదారుడు చంద్రబాబే !

ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడిలో ప్రధాన కుట్రదారుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుయే అని వైఎస్సార్‌ సీపీ నేతల బృందం ఆరోపించింది. ఈ విషయమై సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి ఈ ఘటనపై  కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినపత్రాన్ని ఆయనకు ఇచ్చారు.

జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత పెంచాలని కుడా కోరిన్నట్లు వారు తెలిపారు. రాష్ట్రపతిని కూడా కలసి ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామని వారు వెల్లడించారు. అంతేకాకుండా తిట్లీ తుఫాను బాధితులకు కూడా సహాయం అందించాలని కోరారు. ఈ బృందంలో వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్త సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, వరప్రసాద్‌ ఉన్నారు.

జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఆయనను ఎలాగైనా అంతం చేసేందుకు చంద్రబాబు పథక రచన సాగించారని మండిపడ్డారు. జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారని చెప్పారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఒక చిన్న ఘటన అంటూ ఇన్ని రోజులూ ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించిన చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని వారు ప్రశ్నించారు.

జగన్‌ హత్యకు పన్నిన కుట్ర భగ్నం కావడంతో రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టి హడావుడి చేశారని ధ్వజమెత్తారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే కనీసం ఖండించాల్సింది పోయి దుష్ప్రచారం చేయడానికి యత్నించిన చంద్రబాబు మానవత్వం లేని మనిషినని నిరూపించుకున్నారని దుయ్యబట్టారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీ కేసీనేని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక చంద్రబాబు ప్రోద్బలం లేదా? అని ప్రశ్నించారు.

టీడీపీ–బీజేపీ కలసి ఉన్నప్పుడే సినీ నటుడు శివాజీ ఆపరేషన్‌ గరుడ గురించి చెప్పినప్పుడు చంద్రబాబు దానిపై ఎందుకు విచారణ జరిపించలేదని నిలదీశారు. అసలు దోషులు బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించి, నిజాలను నిగ్గు తేల్చాలని స్పష్టం చేసారు.