గరుడ పురాణం పేరుతో కాలక్షేపం చేస్తున్న ప్రధాన పార్టీలు

రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు అర్థవంతమైన రాజకీయం చేయడం మాని గరుడ పురాణం పేరుతో కాలక్షేపం చేస్తున్నాయని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ద్వజమెత్తారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేద్దామనే లక్ష్యంతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతోందని ఎద్దేవా చేసారు. మాయావతి చరణాల వద్ద చంద్రబాబు కుర్చొని కాంగ్రెస్‌ను బలపర్చాలని కోరడంతో ఎన్టీఆర్‌ ఆత్మఘోషిస్తోందని విచారం వ్యక్తం చేసారు.

గుంటూరులో భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన  ‘మహిళా సాధికారత-మహిళా సమ్మేళనం’ లో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బిజెపి మద్దతు అవసరం కాగలదని స్పష్టం చేసారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది తెలుగుదేశం కాదు తెలుగు ద్రోహం పార్టీ. పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ను రాష్ట్రంలో అమలుకానీయకుండా అడ్డుకుంటున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఉపయోగించుకుంటూనే కేంద్రంపై బురదజల్లుతున్నారు’ అని ధ్వజమెత్తారు.

మహిళల ఆదరణతోనే 2014లో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చారని రాంమాధవ్ గుర్తు చేసారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 8.77కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని, రాష్ట్రంలో సైతం కేంద్రం ఇచ్చిన నిధులతోనే మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. కానీ కాగితాల్లో, క్షేత్రస్థాయిలో లెక్కలకు చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు.  కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తే ఊరికే వదిలిపెట్టమని హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నియంత్రించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు.

రాష్ట్రంలో అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులిస్తుంటే అన్నింటికీ చంద్రన్న పేరుపెట్టుకుని కేంద్రాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే మూడేళ్లలో దేశంలో అందరికీ ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బిజెపి పనిచేస్తోందని చెప్పారు.

మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు విజయ రహత్కర్‌ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో ఎవరి మద్దతు లేకుండానే అధికారంలోకి వచ్చామని, ఆంధ్ర ప్రదేశ్ లోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన నిధులను జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.