కాంగ్రెస్‌ ఓడిపోవడం, మళ్లీ మోదీ ప్రధాని కావడం ఖాయం

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఓడిపోవడం, మళ్లీ మోదీ ప్రధాని కావడం ఖాయం అని బిజెపి అద్యక్షుడు అమిత్ షా స్పష్టం చేసారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో ఆదివారం బీజేవైఎం మహాదివేశన్ సభ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ నాయకుడెవరో తెలియని మహాకూటమితో విజయం సాధించాలని కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, అది జరిగేపని కాదని తెలిపారు.

ఈసారి అధికారంలోకి వచ్చేది తామేనని రాహుల్ కలలు కంటున్నారని అమిత్‌షా ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు ఎన్నో రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైన విషయాన్ని రాహుల్ మర్చిపోయారు. కాంగ్రెస్ ఎన్ని మహాకూటములను ఏర్పాటుచేసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేదు. దేశంలో కాంగ్రెస్‌ను భూతద్దంతో వెతుక్కోవాల్సిందే అని అమిత్‌షా పేర్కొన్నారు.

సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌పార్టీ చిరునామా గల్లంతు కావటం తథ్యమన్నారు. రాహుల్‌ కూటమి పిచ్చుక గూడు అని, ఒక నాయకుడు, నీతి, సిద్ధాంతం, అజెండా దానికి లేదని ఆరోపించారు. తమ నాయకుడిగా అందులోని పార్టీలు అంగీకరించనపుడు, రాహుల్‌బాబా ఇక ప్రధాని అభ్యర్థి ఎలా అవుతారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పార్టీ ‘బ్రేకింగ్‌ ఇండియా’ అంటే... భాజపా ’మేకింగ్‌ ఇండియా’ నినాదంతో ముందుకు వెళ్తోందని తెలిపారు.

దేశం కోసం ఏమీచేయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. మోదీ చేసిందేమిటని అడుగుతున్నాడని, ఆ ప్రశ్న అడిగే అర్హత రాహుల్‌కు లేదని మండిపడ్డారు. దేశ నిర్మాణానికి మోదీ కృషిచేస్తుంటే.. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మహాకూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదరికాన్ని, నిరుద్యోగ సమస్యను, ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలిగించాలని మోదీ చెప్తుంటే.. మోదీని తొలిగించాలని మహాకూటమి నాయకులు చెప్తున్నారని నిప్పులుచెరిగారు.

ప్రస్తుతమున్నదానికంటే మరిన్ని ఎక్కువ సీట్లతో నరేంద్రమోదీ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సారథిలేని మహాకూటమికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మధ్య పోటీ ఉంటుందని పేర్కొన్నారు.

2019 ఎన్నికల తరువాత మే 29 నుంచి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, అసోం నుంచి గుజరాత్‌ వరకు దేశంలోకి ప్రవేశించిన అక్రమ చొరబాటుదారుల్ని వెనక్కు పంపించే కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించారు.

జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) ద్వారా దేశంలో 40 లక్షల మంది అక్రమ చొరబాటుదారుల్ని గుర్తించి వెనక్కు పంపించే ప్రక్రియ ప్రారంభించగానే.. ఎందుకు పంపిస్తున్నారు? ఎక్కడికి వెళ్తారు? ఏమి తింటారు? ఏమి తాగుతారు? ఎక్కడుంటారు? మానవ హక్కులు ఏమవుతాయి? అంటూ కాంగ్రెస్‌ బాబా అండ్‌ కంపెనీ పార్లమెంటులో హంగామా చేసింది. చొరబాటుదారుల మానవహక్కులపై ఉన్న బాధ జవాన్ల హక్కులపై ఎందుకు లేదు? బాంబుపేలుళ్లతో వీరమరణం పొందుతున్న భద్రతా సిబ్బంది, సైనికుల కుటుంబాల బాధ కనిపించదా అంటూ ప్రశ్నించారు.

“మీకు ఓటు బ్యాంకు రాజకీయాలు ఉండవచ్చు. మాకు దేశ భద్రత, రక్షణ ముఖ్యం" అని అమిత్ షా స్పష్టం చేసారు.  మహారాష్ట్ర ప్రభుత్వం పట్టణ మావోయిస్టుల్ని అరెస్టు చేస్తే భావప్రకటన స్వేచ్ఛ అని, ఎందుకు అరెస్టు చేస్తున్నారని రాహుల్‌ కూటమి ప్రశ్నించింది. ఒక విషయం కచ్చితంగా చెప్తున్నా. భారత్‌ను ముక్కలు చేయాలని ఎవరు నినాదాలిచ్చినా వారంతా జైలు ఊచల వెనుక ఉండాల్సిందే అని హెచ్చరించారు.