విషమించిన వాజపేయి ఆరోగ్యం

బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) ఆరోగ్యం విషమంగా మారింది. కిడ్నీ సమస్య, వృద్ధాప్య సమస్యలతో కొద్దికాలంగా  బాధపడుతున్న వాజ్‌పేయి ఇటీవల ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బుధవారంనాడు క్షీణించడంతో పార్టీ అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఎయిమ్స్ చేరుకుంటున్నారు. బిజెపి గురువారం జరుగవలసిన అధికారిక కార్యక్రమాలు అన్నింటిని వాయిదవేసుకొంది. మంగళగిరి సమీపంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ జరుపవలసిన బిజెపి ఎపి కార్యాలయం శంకుస్థాపన కుడా వాయిదా పడింది.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిమ్స్ కు చేరుకొని వాజపేయిని పరామర్శించి, డాక్టర్లను కలసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి వైద్యచికిత్సకైనా వెనుకాడేది లేదని యాన్ వైద్యులకు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వాజపేయి వెంటిలేటర్ పైన ఉన్నారు. అంతకు ముందు బిజెపి అద్యక్షుడుఅమిత్ షా కుడా ఎయిమ్స్ కు వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సదుపాయలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాజ్‌పేయిన గత వారంలో హోం మంత్రి రాజ్‌నాథ్ ఎయిమ్స్‌కు వెళ్లి పరామర్శించారు.

వాజ్‌పేయిని ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగంలో గుర్తుచేసుకున్నారు. కశ్మీర్ అంశంలో శాంతి కోసం వాజ్‌పేయి కన్న కలలను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా తాము ముందుకు వెళ్తామని ప్రధాని ప్రకటించారు. 

'జమ్మూకశ్మీర్ విషయంలో ఇన్సానియత్ (మానవత్వం) జమ్‌హురియత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరియత్ (కశ్మీరీ సంస్కృతి) అనే మూడు సూత్రాల ఆధారంగా ముందడుగు వేసి సమస్యను పరిష్కరించగలమని వాజ్‌పేయి చెప్పేవారు. ప్రజలను అక్కున చేర్చుకోవడం ద్వారానే జమ్మూకశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని అనేవారు' అని ప్రధాని గుర్తుచేశారు.