అత్యంత నమ్మకస్థులైన మిత్రుల్లో మోదీ ఒకరన్న జపాన్ ప్రధాని

జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. తనకు అత్యంత నమ్మకస్థులైన మిత్రుల్లో మోదీ ఒకరని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుతమైన ఇండో-పసిఫిక్ సంబంధాల కోసం మోదీతో కలిసి కృషి చేయాలనుకుంటున్నానని తెలిపారు. నరేంద్ర మోదీ ఓ గొప్ప దేశానికి విశిష్ట నాయకుడని షింజో అబే కొనియాడారు. భారత్-జపాన్ సంబంధాలపై ప్రపంచంలోని అతి పెద్ద శక్తి ఆశీర్వాదాలు ఉన్నట్లు తాను ఎల్లప్పుడూ విశ్వసిస్తానని తెలిపారు.

మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టుకు జపాన్ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. భారతదేశ ఆర్థికాభివృద్ధికి జపాన్ సహకరిస్తుందని చెబుతూ హైస్పీడ్ రైలు, సబ్‌వేలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి సహకరిస్తామని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి అందజేస్తామని తెలిపారు.

ముంబై-అహ్మదాబాద్ మధ్య జపనీస్ షింకన్‌సేన్ బుల్లెట్ రైలు నడవడం ప్రారంభమైన రోజు భావి జపాన్-భారతదేశ మైత్రికి ప్రకాశవంతమైన చిహ్నంగా గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు. అంతకుముందు యమనషి నగరంలో ప్రధాని మోదీకి షింజో అబే ఘనంగా స్వాగతం పలికారు. భారత్-జపాన్ 13వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మోదీ శనివారం జపాన్‌ చేరుకున్నారు.

తాను జీవిత కాలం భారత్‌కు మిత్రుడినేనని పేర్కొన్నారు. ఇరుదేశాల సంబంధాలపై తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని చెబుతూ భారత్ తో స్నేహం వెల్లివిరిసేందుకు కంకణం కట్టుకున్నానని అబే తెలిపారు. తన తాత నొబుసుకె కిషి 1957లో భారత్‌లో పర్యటించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పుడు తమ దేశం ఆర్థికంగా పటిష్ఠంగా లేకపోయినా అప్పటి భారత ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆయనను ఎంతో గౌరవంగా ప్రజలకు పరిచయం చేశారని పేర్కొన్నారు.