బీజేపీలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ చీఫ్ మాధవన్ నాయర్ భారతీయ జనాతా పార్టీలోకి చేరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం తీసుకున్నారు. కేరళలోని కన్నూర్‌లో అమిత్‌షా చేసిన ప్రసంగానంతరం మాధవన్ ఆ పార్టీలో చేరారు.

మాధవన్ నాయర్‌తో పాటు ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మాజీ అధ్యక్షుడు, కేపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు జి.రమణ నాయర్‌, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డాక్టర్ ప్రమీలా దేవి, జేడీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కారాకులం దివాకరన్ నాయర్, మలంకార చర్చికి చెందిన థామస్ జాన్ బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు.

కాగా, బీజేపీలో చేరిన అనంతరం మాధవన్ నాయర్ మాట్లాడుతూ, కొద్దికాలంగా తాను బీజేపీకి పని చేస్తున్నానని, అమిత్‌షా లాంఛనంగా తనను పార్టీలోకి తీసుకున్నారని చెప్పారు. దేశాభివృద్ధి విషయంలో మోదీ ఫిలాసఫీ నచ్చి బీజేపీతో కలిసి పనిచేయాలనుకున్నట్టు చెప్పారు.