మదన్‌లాల్‌ ఖురానా కన్నుమూత

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత మదన్‌లాల్‌ ఖురానా (82) అనారోగ్య కారణాలతో శనివారం రాత్రి 11 గంటలకు ఢిల్లీలోని తమ ఇంట్లో మరణించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1993–96 మధ్య కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఖురానా, 2004లో రాజస్తాన్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఢిల్లీలో బిజెపి మంచి పట్టు పెంచుకోవడంలో విశేషంగా కృషి చేసిన ఆయనను `ఢిల్లీ సింహం’ అని ప్రేమతో పిలుస్తూ ఉంటారు.

69వ రాజ్యంగా సవరణ ద్వారా ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించిన తర్వాత మొదటగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఖురానా. నాలుగు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. వాజపేయి మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాలు, పర్యాటక శాఖల మంత్రిగా పనిచేసారు. రాజకీయాలకు అతీతంగా పలు వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు.

ఆయనకు ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌ ఉందనీ, శనివారం ఉదయం నుంచీ ఆరోగ్యం మరింత విషమించిందని ఖురానా కొడుకు హరీశ్‌ చెప్పారు. అంత్యక్రియలను ఆదివారం నిర్వహిస్తామన్నారు. ఖురానాకు భార్య, ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మరో కుమారుడు నెల క్రితమే మరణించారు. ఐదేళ్ళ నుండి మెదడు సంబంధ వ్యాధితో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు.

2003 వరకు మొత్తం 11 ఎన్నికలలో పోటీ చేసి 10 ఎన్నికలలో గెలుపొందిన ఖురానా ఢిల్లీలో జనసామాన్యంలో మంచి పట్టు ఉన్న ఏకైక బిజెపి నేత అని చెప్పవచ్చు. ప్రజలతో తనకున్న ఆదరణను ఓట్లుగా మార్చ గలిగిన నేత. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా, అధికారాలు కల్పించాలని బలంగా వాదనలు వినిపించిన నేత.

ఢిల్లీలో జనసామాన్యంలోకి బిజెపిని విస్తరించడంతో పాటు, ఢిల్లీ నగర అభివృద్దికి విశేషంగా కృషి చేసారు. ఒక సందర్భంగా ప్రముఖ రచయత కుష్వంత్ సింగ్ ఆయన గురించి వ్రాస్తూ “నాకు ఢిల్లీలో అధికారంలో ఉన్న ప్రముఖులు అనేకమందితో సన్నిహిత సంబంధాలు సుదీర్ఘకాలంగా ఉన్నాయి. నెహ్రు నుండి ప్రముఖులు అందరూ తెలుసు. కాని ఒక మాట మాత్రం చెప్పగలను. ఢిల్లీ అభివృద్ధి కోసం ఖురానా పడిన తపన, ఆయన చేసిన కృషి మరెవ్వరు చేయలేదు” అని కొనియాడారు.

జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖురానా మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఢిల్లీ అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఢిల్లీకి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం అవిశ్రామంగా కృషి చేసారని పేర్కొన్నారు. కష్టపడి పని చేసే నేతగా, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించే పరిపాలన దక్షుడిగా పేరు పొందారని గుర్తు చేసారు. ఆయన కుటుంభ సభ్యులకు ప్రగడ సానుభూతి వ్యక్తం చేసారు.

ఖురానా మృతి పట్ల బిజెపి అద్యక్షుడు అమిత్ షా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఒక ఆదర్శ స్వయంసేవక్ గా, అంకితభావంతో పనిచేసిన ఎబివిపి కార్యకర్తగా, జనసంఘ్, బిజెపిలకు గట్టి పునాదులు వేసిన ఎప్పటికి గుర్తుంది పోతారని ఘనంగా నివాళులు అర్పించారు. `ఢిల్లీ సింహం’గా పేరొందిన ఆయన ఢిల్లీలో పార్టీకి గట్టి పునాదులు వేయడంలో, పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించారని కొనియాడారు. “కోట్లాది మంది బిజెపి కార్యకర్తల పట్ల నేను ఖురానా కుటుంభానికి సంతాపం తెలియచేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రాదిస్తున్నారు” అని పేర్కొన్నారు.

ఖురానా మృతి పట్ల ప్రగడ సంతాపం వ్యక్తం చేస్తూ ఒక పెద్దవారుగా ఎప్పుడు మార్గదర్శిగా, శ్రేయోభిలాషిగా ఉండేవారని జౌళి శాఖా మంత్రి స్మ్రితి ఇరాని పేర్కొన్నారు. ఢిల్లీ నగర అభివృద్దికి ఆయన చేసిన కృషి ఎల్లప్పటికి గుర్తుండిపోతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి నివాళులు పరించారు.