కాంగ్రెస్‌తో కలిస్తే మీటూ అనాల్సిందే : రాజ్‌నాథ్‌సింగ్

కాంగ్రెస్‌తో జతకట్టేందుకు ఉత్సాహం చూపుతున్న పార్టీలు ఎన్నికల అనంతరం మీటూ ఉద్యమం చేయాల్సి వస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎద్దేవాచేశారు. హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో నిర్వహించిన రెండు రోజుల  బీజేవైఎం విజయలక్ష్య-2019 యువ మహాదివేశన్ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభిస్తూ తిహితం కన్నా రాజకీయహితమే కాంగ్రెస్ కోరుకొంటున్నదని, స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్‌ను రద్దుచేయాలన్న గాంధీ మాటలు చెవిన పెట్టలేదని తెలిపారు. మోదీని ఓడించడం మినహా విపక్షాలకు మరోఎజెండా లేదని, అన్నిపక్షాలు ఒక్కటైనా కూడా మోదీని, బీజేపీని ఆపలేవన్నారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని స్పష్టం చేసారు.

కాంగ్రెస్‌పార్టీకి దేశ భవిష్యత్తుపై స్పష్టమైన అజెండా లేదని, మోదీని నిలువరించడమే లక్ష్యమంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ద్వజమెత్తారు. కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసే పక్షాలన్నీ ఆ తరువాత పశ్చాత్తాపపడతాయిని, నమ్మిన పార్టీలను మోసం చేయడం ఆ పార్టీ నైజం అని హెచ్చరించారు. కాంగ్రెస్ తో చేతులు కలిపినా ఏ పార్టీ అయినా ఆ తర్వాత తుడిచిపెట్టుకు పోతాయని గుర్తు చేసారు.

ఆ పార్టీతో ఇన్నేళ్లు కలిసి నడిచిన కమ్యూనిస్టుల ప్రస్తుత పరిస్థితి ఏమిటో దేశానికి తెలుసని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ముందు కాంగ్రెస్ తో చేతులు కలిపి, తర్వాత మోసపోయామని గ్రహింఛి `మిటూ’ అంటూ కాంగ్రెస్ పై ఉద్యమం ప్రారంభించవలసి వస్తుందని చెప్పారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చట్టపర, సంస్థాగతమైన అంశాలను బలోపేతం చేయడం కోసం ప్రధాని నీయమించిన మంత్రుల బృందానికి రాజనాథ్ సింగ్ సారధ్యం వహిస్తుందటం తెలిసిందే.

ఈ మధ్య రాహుల్‌ గాంధీ ఎక్కడికి వెళ్లినా రఫేల్‌ జపం చేస్తున్నారని అంటూ యూపీఏ కన్నా మెరుగైన ఒప్పందం తమ ప్రభుత్వం చేసుకున్నదని స్పష్టం చేసారు. “మేం కొన్నవి నేరుగా కదనరంగంలోకి దిగే విమానాలు. ఇవన్నీ దేశరక్షణకు సంబంధించిన అంశాలు. విమానాల బోల్టు ఖర్చు ఎంత? రంగు ఖర్చు ఎంత? అని అడుగుతున్నారు. దేశభద్రతకు సంబంధించిన అంశాలపై శత్రువులకు సహాయం చేస్తున్నారు. ర...ఫేల్‌ కాదు... రాహుల్‌...ఫెయిల్‌” అంటూ విరుచుకు పడ్డారు.

ఓటు బ్యాంకు రాజకీయాల పేరిట భారతీయ సంస్కృతి, విజ్ఞానాన్ని అపహాస్యం చేశారని ఈ సందర్భంగా హోంమంత్రి విమర్శించారు. బడుగు, బలహీన, పేద వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడంతో పాటు అందరికీ సమన్యాయం అందించడమే బిజెపి లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు చేసే ఆరోపణలతో బిజెపి మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యువమోర్చా బలగం బిజెపికి అతిపెద్ద ఆస్తిగా అభివర్ణించారు. అవకాశవాద, మోసపూరిత రాజకీయాలను మార్చేందుకు యువత ముందుకు రావాలని, దేశ ప్రయోజనాలు కాపాడేందుకు, మరోసారి మోదీని గెలిపించేందుకు యువమోర్చా కార్యకర్తలు పనిచేయాలంటూ పిలుపునిచ్చారు.

విజ్ఞానం, ఆర్థిక వ్యవస్థలో దేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురు స్థానంలో నిలిపేశక్తి, మహాభారత్‌గా తీర్చిదిద్దే సత్తా బిజెపికి మాత్రమె ఉందని రాజ్‌నాథ్‌ తెలిపారు. ‘‘టికెట్లు, ప్రలోభాల కోసం రాజకీయపార్టీల ముందు ఆత్మాభిమానం తాకట్టు పెట్టవద్దు. మీరు యాచకులు కారు. ఇచ్చేవాళ్లు. మీకు లభించాల్సిన హక్కును ఏ శక్తీ ఆపలేదు. దేశ ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేయాలి’’ అని యువతకు హితవుపలికారు.

 మోదీ నాలుగున్నరేళ్ల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, ఇప్పటికే ఫ్రాన్స్‌ను వెనక్కు నెట్టామని తెలిపారు. 2030 నాటికి ప్రపంచంలో అతి పెద్ద మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలుస్తుందని భరోసా వ్యక్తం చేశారు. యువమోర్చా ప్రతినిధులు రాజకీయ కార్యకర్తల్లా కాకుండా, సామాజిక రాజకీయ మార్పు తీసుకువచ్చే ప్రతినిధుల్లా వ్యవహరించాలని సూచించారు. బిజెపి ప్రకాశిస్తున్న సూర్యుడి వంటిది. పార్టీని గెలిపించేందుకు యువమోర్చా కార్యకర్తలు ఆరునెలల ముందుగానే ఇంటిని వదిలిపెట్టి బిజెపి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని 350కి పైగా సీట్లతో గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవాలని అని కోరారు.