అమరావతి బాండ్లు ప్రజల పాలిట శాపమా !

రాజధాని నిర్మాణం కోసం `అమరావతి బాండ్ల’ను జారీ చేసి రూ 2,000 కోట్ల మేరకు స్టాక్ మార్కెట్ లో నిధులు సేకరించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలుత సోమవారం రూ.1300 కోట్లు సేకరించేందుకు అమరావతి బాండ్లను విడుదల చేయగా గంటలోనే అమ్ముడు పోవడంతో సంబరపడి పోతున్నారు. త్వరలో మిగిలిన రూ 7,000 కోట్ల బాండ్లు కుడా జారీకి సిద్దపడుతున్నారు.

 

గంటలోనే అవి అమ్ముడు పోవడం దేశంలో చంద్రబాబుకున్న ఇమేజ్ వల్లే సాధ్యపడినదని టిడిపి నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం హామీగా ఉంటూ ఈ విధంగా బాండ్లను జారీ చేసి నిధులను సేకరించడం వల్లన నిజంగా రాష్త్రం ప్రయోజనం పొందగలదా అనే అనుమానాలు చెలరేగుతున్నాయి.

రాజధాని బాండ్ల విక్రయంతో ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్హి  ఐవైఆర్‌ కృష్ణా రావు స్పష్టం చేసారు. బ్యాంకు వడ్డీ కంటే అధికంగా చెల్లిస్తామని విక్రయాలు చేపడుతున్నారని, దీని వల్ల ప్రజలపై భారీగా భారం పడే అవకాశముందని హెచ్చరించారు.  షేర్‌ మార్కెట్‌లో ఓవర్‌ సబ్‌స్రైబ్‌ మంచిదే కానీ బాండ్ల విక్రయంలో మంచిది కాదని వారించారు. రూ.60 వేల కోట్లతో ఎన్నికల సంవత్సరంలో టెండర్లు పిలవడం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై భారీగా భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసారు.

బాండ్ల ద్వారా వచ్చేదంతా అప్పే అవుతుందని, వాటిని తిరిగి చెల్లించవలసి ఉంటుందని గుర్తు చేసారు.   ప్రజలపై భవిష్యత్‌లో పెద్దభారం పడుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి, అధిక వడ్డీ చెల్లించినపుడు స్పందన బాగా ఉంటుందని అంటూ బాండ్ల ద్వారా వచ్చే రూ.60 వేల కోట్ల అప్పుతో ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వ రుణభారం 29 నుంచి 35 శాతానికి పెరుగుతుందని వెల్లడించారు. దీని వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోతుందని, ప్రజలపై మరింత భారం పడే అవకాశముందని స్పష్టం చేసారు.