శబరిమల దేవాలయం, హిందూ విశ్వాసాల విధ్వంసానికి సిపిఎం కుట్ర

కేరళలో శబరిమల దేవాలయాన్ని, హిందూ విశ్వాసాలను విధ్వంసం చేయడం కోసం కు, దేవాలయాలకు సిపిఎం ప్రభుత్వం కుట్ర పన్ని భయానక వాతావరణం సృస్తిస్తున్నదని బిజెపి అద్యక్షుడు అమిత్ షా తీవ్రంగా విమర్శించారు. కేరళలోని కన్నూర్ లో బిజెపి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, ఈ సందర్భంగా జరిపిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మత నమ్మకాలకు, ప్రభుత్వ క్రూరత్వానికి మధ్య కేరళలో పోరాటం జరుగుతోందని చెప్పారు. ఈ పోరాటంలో బిజెపి అయ్యప్ప భక్తులకు మద్దతుగా ఉంటుందని స్పష్టం చేసారు.

సుప్రేం కోర్ట్ తీర్పు అమలు సాకుతో కేరళలో హిందువులపై పినరాయి విజయన్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను రాష్ట్రంలోని మహిళలు సహితం ఖండిస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలతో సహా వివిధ సంస్థలకు చెందిన రెండు వేలమందిని పైగా అరెస్ట్ చేసి ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులను సృష్టిస్తున్నారని ద్వజమెత్తారు.

న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్న పేరుతో హింసను ప్రేరేపించాలనుకుంటున్న సిపిఎం ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని అమిత్ షా హెచ్చరించారు. దేశంలో ఎన్నో దేవాలయాలు ఎన్నో రకాల ఆచారాలు, నిబంధనల ప్రకారం నడుస్తున్నాయని చెబుతూ అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి.. కనుకనే ఆ ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని నిషేధించారు అని తెలిపారు. ఇతర అయ్యప్ప దేవాలయలలో ఇటువంటి ఆచారం లేదని గ్రహించాలని సూచించారు.

 శబరిమల వివాదంలో అయ్యప్ప భక్తులకు, దేవుడిని నమ్మే వారికి, కేరళ ప్రజలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుప్రేం కోర్ట్ ఉత్తరువు అమలు పేరుతో సాగిస్తున్న క్రూరత్వాన్ని ఆపివేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు. లేనిపక్షంలో `అగ్నితో ఆడుకోవడం’ కాగలదని హెచ్చరించారు. ఎన్నో కోర్ట్ ఉత్తరువుల అమలు గురించి పట్టించుకోని ప్రభుత్వం కేవలం ఈ విషయంలో మాత్రం అందుకోసం తీవ్రమైన అణచివేతను అమలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు.

కాగా, ప్రారంభోత్సవానికి సిద్ధమైన కన్నూర్‌ విమానాశ్రయంలో అడుగుపెట్టిన తొలి ప్రయాణికుడిగా అమిత్‌ షా నిలిచారు. దీన్ని కన్నూర్‌ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే మట్టనూర్‌లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో నిర్మించారు. ఇది కేరళలో నిర్మించిన నాలుగో అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ రాష్ట్రంలో ఇప్పటికే కోచి, తిరువనంతపురం, కాలికట్‌ విమానాశ్రాయాలు ఉన్నాయి. కన్నూర్‌ విమానాశ్రయం ఇతర ప్రయాణికులకు ఎప్పటి నుంచి సేవలు అందిస్తుందన్న విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. దీన్ని డిసెంబరులో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.