చేరిసగం సీట్లలో పోటీకి బిజెపి, జెడియు నిర్ణయం

2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో పొత్తుపై బిజెపి, జనతాదళ్‌(యు) ఒక అవగానకు వచ్చాయి. చేరి సగం సీట్లు పోటీ చేస్తామని బిజెపి అద్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో అమిత్‌ షా 2019 లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకం విషయమై భేటీ అయ్యారు. బిజెపి కూటమిలో  పొత్తు పెట్టుకున్న ప్రతి పార్టీకి సీట్ల పంపకం విషయంలో తగిన ప్రాధాన్యం ఇస్తామని అమిత్‌ షా ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

పార్టీతో కొత్త భాగస్వామి వచ్చి కలిసినప్పుడు.. పరిస్థితులను బట్టి మనం త్యాగం చేయక తప్పదని ఆయన బిజెపి నేతలకు సంకేతం ఇచ్చారు. షా ప్రకటనను బట్టి చూస్తే.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బిజెపి తాను పోటీ చేయనున్న ఎంపీ స్థానాల సంఖ్య తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైంది. గత ఎన్నికలలో సొంతంగా 22 సీట్లు గెలుపొందగా, ఇప్పుడు 16 లేదా 17 సీట్లకు మించి పోటీ చేసే అవకాశం ఉండక పోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

బిహార్‌లో 40 లోక్‌సభా స్థానాలున్నాయి. ప్రస్తుత ఎన్డీయే కూటమిలో జనతాదళ్‌తో పాటు, లోక్‌ జన్‌శక్తి పార్టీ(రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌), రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ(ఉపేంద్ర కుష్వా)లు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కూటమిలో మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం గురించి రెండు, మూడు రోజుల్లో పూర్తి సమాచారం వెల్లడించనున్నట్లు షా తెలిపారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఏ పార్టీతో పొత్తులేకుండా మొత్తం 40స్థానాల్లో పోటీచేయగా కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఎన్డీయే కూటమిలో ఉన్న మిగతా రెండు పార్టీలు కలిసి 40 స్థానాల్లో పోటీ చేయగా 31చోట్ల ఈ కూటమి విజయం సాధించింది.

ఇదిలా ఉండగా, నరేంద్రమోదీని వ్యతిరేకిస్తూ నితీశ్‌ కుమార్‌ 2015 బిహార్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌‌(ఆర్‌జేడీ), కాంగ్రెస్‌తో మహాకూటమిగా జత కలిశారు. ఫలితాల్లో ఆర్జేడీ 80 స్థానాల్లో, జేడీయూ 71 చోట్ల, కాంగ్రెస్‌ 27చోట్ల.. మొత్తంగా 178చోట్ల విజయం సాధించాయి. నితీశ్‌ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

కాగా ఎన్డీయే కూటమి మాత్రం 58స్థానాలతో సరిపెట్టుకుంది. అనంతరం ఆర్జేడీతో పొసగక మహాకూటమి నుంచి బయటకు వచ్చిన నితీశ్‌ కుమార్‌ గత సంవత్సరం ఎన్డీయే కూటమిలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బిజెపి సీట్ల సర్దుబాటుపై మిత్ర పక్షాలతో ఒక అవగాహనకు వచ్చిన రాష్ట్రం బిజెపి కావడం గమనార్హం.