పవన్‌పై కూడా దాడికి కుట్ర.. కన్నా

ప్రతిపక్ష నేతలు రాష్ట్రంలో ప్రశాంతంగా తిరిగే పరిస్థితి లేదని మండిపడుతూ ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కుడా దాడి జరగవచ్చని బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేసారు. అందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే  అమిత్ షాపై దాడి చేశారని, అలాగే తనపై కూడా దాడి చేశారని గుర్తు చేసారని, ఇప్పుడు జగన్ పై దాడి జరిగినదని పేర్కొన్నారు. 

ఆపరేషన్ గరుడ సృష్టికర్త చంద్రబాబేనని కన్నా ఆరోపించారు. ఓ సినిమా యాక్టర్ చెప్పిన వాటిని చదివే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారిపోయారని ద్వజమెత్తారు. సినిమా నటుడిని తక్షణమే అరెస్ట్ చేసి కుట్రలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సినిమా నటుడు చదివిన స్క్రిప్ట్ అంతా సీఎం రాసిందేనని దుయ్యబట్టారు.

బాబుకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే ఏడాది సర్వీస్ ఉన్న ప్రసాద్‌రావుని తప్పించి చంద్రబాబు తన బంధువును డీజీపీగా పెట్టుకున్నారని చెప్పారు. మోదీ సీబీఐలో తన బంధువును పెట్టుకోలేదని గుర్తు చేశారు.

అలిపిరిలో దాడి జరిగినప్పుడు చంద్రబాబు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసమర్థ పాలన జరుగుతుంటే గవర్నర్ జోక్యం చేసుకోవడంలో తప్పేంలేదని స్పష్టం చేసారు. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి సూసైడ్ నోట్ రాసుకోవడం చూశాం గానీ.. హత్య చేసే వ్యక్తి లేఖ రాయడం టీడీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నానమని ఎద్దేవా చేసారు.