జగన్ పై దాడిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

జగన్‌పై జరిగిన దాడి ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తేనే ప్రజలకు నిజాలు తెలుస్తాయని మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు స్పష్టం చేసారు. ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరుపై అనుమానాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు. జగన్‌పై జరిగిన దాడి ఆయన అభిమానే చేశాడని, చిన్న గాయమే అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు.

ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రాష్ట్రంలో సంచరించడానికి భయపడే పరిస్థితులను సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాణభయంతో ప్రతిపక్షాలు బయట తిరగకుండా ఉంటే వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందాలనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని విమానాశ్రయాలను ఏపీ పోలీసులే పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. గతంలో కూడా విశాఖ రన్‌వేపై రాష్ట్రానికి చెందిన పోలీసులే జగన్‌ను అడ్డుకోవడం చూశామని గుర్తు చేశారు.

ఆపరేషన్‌ గరుడ అంటూ నటుడు శివాజీ చెప్పింది నిజమే అయితే ఎందుకు మీ ప్రభుత్వం.. మీ పోలీసు వ్యవస్థ జగన్‌పై జరిగిన దాడిని అడ్డుకోలేకపోయిందని ప్రశ్నించారు. ఒక వేళ శివాజీ చెప్పిందే నిజమైతే దాడి మీ ఫెయిల్యూర్‌గా భావించి మీరు, హోంమంత్రి చినరాజప్ప రాజీనామా చేసి ప్రభుత్వాన్ని శివాజీకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

ఇప్పటికైనా శివాజీని అదుపులోకి తీసుకుని ఆపరేషన్‌ గరుడ వెనక ఎవరు ఉన్నారో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. ఒకవేళ ఆపరేషన్‌ గరుడపై విచారణ జరిపితే దీని వెనకున్న పెద్దలకు, మీ ప్రభుత్వానికి నష్టమా అని చంద్రబాబును ప్రశ్నించారు.