భారీ బ్యాంకు రుణం పర్సంటేజీల కోసమేనా!

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  రూ.12,600 కోట్లు వాణిజ్య బ్యాంకుల నుంచి ఆదరాబాదరా అప్పుచేయడం పర్సంటేజీల కోసమేననే అనుమానం కలుగుతోందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అనుమానం వ్యక్తం చేసారు. సుమారు మరో నాలుగు నెలల మాత్రమే పదవీ కాలంలో వుండే ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు అప్పు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అలాగే వచ్చే ఐదేళ్లకు సరిపడా పనులకు ఇప్పుడే అమోదం ఇవ్వడం వెనక మతలబు ఏమిటని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పనులు చేపట్టడానికి వాణిజ్య బ్యాంకుల నుంచి 8 శాతం వడ్డీతో రూ.12,600 కోట్లు అప్పు తీసుకోవడానికి గత 22వ తేదీన జీవో జారీ అయిందని చెప్పారు. ఇందులో రూ.11,340 కోట్లు వాణిజ్యబాంకులు, రూ.1260 కోట్లు ప్రభుత్వం సమకూర్చుతాయని తెలిపారు. గతంలో నిధుల కోసం ప్రయత్నించినపుడు హడ్కో సంస్థ 8 శాతం వడ్డీపై ఇస్తామంటే 6 శాతం వడ్డీకే ఇవ్వాలని బేరమాడారని ఉండవల్లి గుర్తుచేశారు. ఇపుడు 8 శాతం వడ్డీపై వాణిజ్య బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని, రానున్న ఐదేళ్ల కాలానికి కూడా ఇపుడే టెండర్లు పిలిచి, ఏజెన్సీలు ఖరారు చేయాలనుకోవడం ఎందుకని నిలదీశారు.

ఈ నిధుల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు రూ.864 కోట్లు కేటాయించారని చెబుతూ అధికారానికి ఆఖరి నాలుగు నెలల్లో రూ.12,600 కోట్లు అప్పు చేయడాన్ని ఈ ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుందని ఉండవల్లి ప్రశ్నించారు. ఈ ఏడాది రూ.3000 కోట్లు ఖర్చు చేసే విధంగా నిర్ణయించారని, టెండర్లు, ఏజెన్సీలు ఖరారు చేయడం వంటి ప్రక్రియలన్నీ ఇపుడే పూర్తిచేసేసి పర్సంటేజీలు కూడా ఇపుడు లాగేసేందుకు ఈ తతంగమంతా ఇపుడే పూర్తిచేస్తారని ఆరోపించారు. ఈ అప్పు తీర్చాల్సింది మాత్రం మున్సిపాలిటీలేనని స్పష్టం చేసారు.

స్థానిక సంస్థల అధికారాలను ప్రభుత్వం హైజాక్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. కాగా, అమరావతి కోసం రూ.2000 కోట్ల బ్యాండ్ బాజాలపై 10.35 శాతం వడ్డీని ప్రశ్నించడంపై ఇప్పటికొచ్చి ప్రభుత్వ సలహాదారు కుటుంబరావు సమాధానం చెప్పలేదని తెలిపారు. 10.36 శాతం వడ్డీ తప్పా కాదో చెప్పాలని నిలదీశారు. మున్సిపాలిటీల్లో చేపట్టేందుకు అప్పు తెచ్చిన నిధులు, అమరావతి బాండ్లు, అన్ని క్యాంటీన్ల ఖర్చులు తదితర పనులపై శే్వతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.

రాజధాని పేరుతో ఒక్క శాశ్వత భవనం కూడా లేదని దయ్యబట్టారు. ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారో ప్రభుత్వం తరపున సమాధానం చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి పోలవరం 72 సార్లు వచ్చినా ఏ ఒక్క సమీక్ష మినిట్స్‌లోనూ ముఖ్యమంత్రి సూచించినట్టు లేకపోవడం చాలా చిత్రంగా వుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పోలవరం 58 శాతం పూర్తయిందని, మేలో నీళ్ళిస్తామని ప్రకటించడం విడ్డూరంగా వుందని, అసలు మేలో గోదావరిలో నీళ్ళుంటాయా అని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రిని పక్కనున్న వారు తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.

జెట్ గ్రౌటింగ్ అపుడే కొట్టుకు పోయిందని ఆరోపిస్తూ ఇందుకు సంబంధించి తనకు ఫొటోలు కూడా నిర్మాణ ప్రాంతం నుంచి ఎవరో పంపించారని చెప్పారు. ప్రభుత్వం నుంచి ప్రతినిధి ఎవరైనా వస్తే తాను ఇప్పటి వరకు చేసిన ఆరోపణలకు సంబంధించి పోలవరం నిర్మాణ లోపాలను చూపిస్తానని స్పష్టం చేసారు. ప్రధాన డ్యామ్ ఇంకా నిర్మాణమే మొదలు పెట్టలేదని, మేలో ఎలా నీళ్ళిస్తారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఉచిత ఇసుక పేరుతో దారుణంగా దోచుకుంటున్నారని ఉండవల్లి ఆరోపించారు. ఇందులో 60 శాతం అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. యూనిట్ ఇసుకను బయటకు తీసేకుందుకు కూలీ ఖర్చు రూ.700, లోడింగ్ చార్జి రూ.100 వెరసి రూ.800 అవుతుంటే, ట్రాన్స్‌పోర్టు చార్జీలు దూరాన్ని బట్టి వుంటాయని, కానీ ఇసుక మాత్రం రూ.4000కు పైగానే అమ్మకాలు సాగిస్తున్నారని వివరించారు. ఎవరైనా యూనిట్ ఇసుకను రూ.800లకు తీసుకుంటున్నారంటే తన ఆరోపణలన్నీ ఉపసంహరించుకుంటానని స్పష్తం చేసారు.