టీఆర్ఎస్కు ఓటేస్తే మజ్లీస్‌కు ఓటు వేసినట్టేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు హెచ్చరించారు. హైదరాబాద్ లో ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబం రాజభోగాలు అనుభవిస్తూ ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, అవినీతి అక్రమాలకు కేరాఫ్‌గా టీఆర్ఎస్ పార్టీ మారిందని ద్వజమెత్తారు.
కేసీఆర్ మాటలు వింటుంటే కడుపు నిండుతుందని, చేష్టలు చూస్తే కడుపు మండిపోతుందని విమర్శించారు. దేశంలో మచ్చలేని నాయకుడుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశానికి సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. గత పాలకుల అవినీతి అక్రమాలే బీజేపీ గెలుపుకు బాటలు వేస్తాయని భరోసా వ్యక్తం చేసారు. హైదరాబాద్‌ను డల్లాస్‌గా తీర్చిదిద్దుతానన్న కేసీఆర్, అంతే కాకుండా నగరంలోని రోడ్లన్నీ అద్దాలుగా మారుస్తానన్న కేసీఆర్ మాటలు నేటికి నీటి మూటలుగానే మిగిలిపోయాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి వివరించాల్సిన బాధ్యత బూత్‌స్థాయి నాయకుల కు, కార్యకర్తలపై ఆధారపడి ఉందని సూచించారు. కార్యకర్తలు అభివృద్ధి ఎజెండాగా పనిచేసి బీజేపీ గెలుపుకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి, కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం అనే గొప్ప వ్యక్తి పేరాల అని పొగిడారు.
అమరుల త్యాగాలను విస్మరించిన కేసీఆర్‌ని పాలన నుండి బహిష్కరించాలని, ఫామ్ హౌస్‌కి పరిమితం చేయాలని కోరారు. తాను నియోజకవర్గంలోని భుపేష్ గుప్తా నగర్లో పర్యటించానని అక్కడి పరిస్థితులు గమనిస్తే వారానికొక్కసారి త్రాగునీరు వస్తున్నాయని అక్కడి వారు తనతో వాపోయారని చెప్పారు. ప్రజలకు తాగునీరు ఇవ్వలేని కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వాగ్ధానాలు నమ్మదగినవి కావని కేటీఆర్‌ని ముఖ్యమంత్రి చేయడమే కేసీఆర్ విజన్ అని స్పష్టం చేశారు.
ఎల్బీనగర్ గడ్డ బీజేపీకి అడ్డ అని అలాంటి గడ్డ మీద బీజేపీ జెండా ఎగురవేసి దేశంలో ఎక్కడా జరుగని అభివృద్ధి ఎల్బీనగర్లో చేసి చూపిస్తానని నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పేరాల శేఖర్‌రావు ఈ సందర్భంగా భరోసా వ్యక్తం చేసారు. అవసరమై తే కేంద్రం ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేసేందుకు వెనుకాడనని హామీ ఇచ్చారు. ఔటర్ రింగు రోడ్డు అక్రమార్కులకు, రౌడీ రాజ్యం పెంచిపోషిస్తున్న బూర్జా పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించమని, బీజేపీని గెలిపించమని పిలుపిచ్చారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం ఏర్పడక ముందు మలకపెట్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు తాను రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచానని, అప్పుడు చేసిన అభివృద్ధే నేటికీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు.ఎల్బీనగర్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురవేయాలని అందుకు ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు నడుం బిగించాలని విజ్ఞప్తి చేసారు.