జాతీయ యువ సమ్మేళనానికి హైదరాబాద్ సిద్దం

తెలంగాణ రాజధాని హైదరాబాద్ జాతీయ యువ సమ్మేళనానికి వేదికగా మారనుంది. బీజేపీ అనుబంధ యువజన విభాగం బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు ‘విజయ లక్ష్య యువ అభివేషన్’ పేరుతో యువ సమ్మేళనం నిర్వహించనుంది. ప్రతీ మూడేళ్లకు ఒకసారి జరిగే ఈ సమ్మేళనం తొలిసారిగా దక్షిణ భారతంలో జరుపుతున్నారు.

దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన యువ ప్రతినిధులు ఈ సమ్మేళననానికి హాజరుకానున్నారు. బీజేవైంఎ మండల శాఖ ఆ పై బాధ్యతలు నిర్వహించే ప్రతి ఒక్కరూ హాజరుకావాల్సి ఉంది. ఈ లెక్కన వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 70 వేల మంది వస్తారని అంఛనా వేస్తున్నారు. శుక్రవారం నుంచి ప్రతినిధులు సభ నిర్వహించే పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 28న సాయంత్రం బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరవుతున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొనడం, మరోవంక దేశం సాధారణ ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో హైదరాబాద్‌లో యువ సమ్మేళనం నిర్వహిస్తుండడంతో రాజకీయంగా వ్యూహాత్మకంగా మారింది. ఎన్నికలలో నూతన యువ ఓటర్లను ఆకర్షించడం కోసం కొన్నేళ్లుగా ప్రత్యేక కృషి చేస్తున్న బీజేపీ ఆ దిశలో ఈ సమ్మేళనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. బహిరంగ సభకు దాదాపు 2 లక్షల మందిని సమీకరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థులతో పాటు టికెట్లు ఆశిస్తున్న ఆశావహులతో గురువారం సమావేశం నిర్వహించారు. బహిరంగ సభకు 119 నియోజక వర్గాల నుంచి యువజనులను సమీకరించాలని ఆదేశించారు. 

జాతీయ స్థాయిలో జరిగే యువ సమ్మేళనంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు పాల్గొంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే సమ్మేళనానికి హాజరయ్యే ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకోవడం ప్రారంభం అవుతుంది. రాత్రి ఏడుగంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.  

శనివారం  ఉదయం ప్రతినిధులను ఉద్దేశించి బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ పూనం మహాజన్ స్వాగతోపన్యాసం చేస్తారు. ప్రతినిధుల సభలో కేంద్రహోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్, కేంద్రమంత్రి దర్మేంద్ర ప్రధాన్, ఎంపీ అనురాగ్ ఠాకూర్, బీజేఎల్పీ మాజీ నేత జీ కిషన్‌రెడ్డి ప్రసంగిస్తారు యువజన విధానంపై చర్చ జరిపిన తరువాత రాజకీయ తీర్మానాలు చేస్తారు. అనంతరం కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించిన తరువాత రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ ఉంటుంది. 

ఆదివారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగాల తరువాత  బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమ్మేళనం ముగింపు ప్రసంగం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో కూడా అమిత్ షా ప్రసంగిస్తారు.