ఐదో తరం (5జీ) నెట్‌వర్క్‌కు రిలయన్స్ సిద్దం

ఐదో తరం (5జీ) నెట్‌వర్క్‌కు సిద్ధమని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్, జియో అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. జియో ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్, ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ దేశాల్లో భారత్‌ను టాప్-3లోకి చేర్చగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మూడు రోజులపాటు జరుగనున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)-2018లో ముకేశ్ అంబానీతోపాటు భారతీ ఎయిర్‌టెల్ అధిపతి సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లాతో, ఎరిక్సన్, హువావీ, సామ్‌సంగ్ వంటి పలు దేశ, విదేశీ మొబైల్ కంపెనీల సారథులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముకేశ్ మాట్లాడుతూ ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ దేశాల్లో ప్రస్తుతం భారత్ 135వ స్థానంలో ఉందని, జియో ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలతో మొదటి మూడు దేశాల్లో ఒకటి కాగలదని చెప్పారు. రాబోయే రెండేండ్లలో ప్రపంచంలోనే మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగంలోనూ భారత్ ర్యాంకును ఇప్పుడున్న 155 నుంచి అగ్రస్థానానికి తీసుకొస్తామన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

2జీ నుంచి 3జీకి, 3జీ నుంచి 4జీకి మారడం అనేది ప్రపంచంలోనే భారత్‌లో వేగంగా జరుగుతున్నది. 2020 నాటికి భారత్ పూర్తిస్థాయిలో 4జీ దేశంగా మారనున్నదని నేను గట్టిగా నమ్ముతున్నాను. అంతేకాదు ఇతర దేశాల కంటే ముందుగానే 5జీని కూడా వినియోగంలోకి తెస్తాం అని భరోసా వ్యక్తం చేసారు. 2020 కల్లా దేశంలో ప్రతీ ఫోన్ 4జీ ఆధారిత ఫోన్ అవుతుందని, ప్రతీ వినియోగదారుడికి 4జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుందన్న ధీమాను కనబరిచారు.. ఈ నవ ప్రపంచంలో డేటా అనేది కీలక వనరుగా అభివర్ణించిన అంబానీ భారత్‌కు, భారతీయులకు దాన్ని చౌకగా చేరువ చేస్తున్నది జియోనేనని స్పష్టం చేసారు.

వొడాఫోన్, ఐడియా నెట్‌వర్క్ ఏకీకరణపైనే ఇప్పుడు తమ దృష్టి అంతా ఉన్నదని వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా స్పష్టం చేశారు. బలమైన ప్రపంచ శ్రేణి నెట్‌వర్క్‌గా తమ సంస్థను నిలపడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమన్న ఆయన 5జీకి వెళ్లే ముందు ఇప్పుడున్న టెక్నాలజీ, పెట్టుబడుల్లో పరపతిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ ఇండియా లక్ష్యసాధనకు వొడాఫోన్ ఐడియా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

డేటా రక్షణ చట్టం తుది ఆమోదం దిశగా వెళ్తున్నదని, కేంద్ర ప్రభుత్వం డిజిటైజేషన్‌కు మద్దతునిస్తున్నదని, అయితే డేటా సమగ్రత విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఐఎంసీ సందర్భంగా జియో-ఎరిక్సన్, హువావీ-ఎయిర్‌టెల్, సామ్‌సంగ్‌లు 5జీ టెక్నాలజీ అద్భుతాలను ఆవిష్కరించాయి. ముఖ్యంగా జియో హైస్పీడ్ 5జీ నెట్‌వర్క్ టెక్నాలజీ ద్వారా ఫేస్ రికగ్నిషన్‌తో ఢిల్లీలో కూర్చుని ముంబైలో కార్లు నడుపడం దగ్గర్నుంచి, ఆకాశంలో పటిష్ఠ నిఘా కోసం డ్రోన్లను నిర్వహించడం ఎలాగో వరకు ఎరిక్సన్ చూపించింది.

అలాగే భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యంలో భాగంగా చైనాకు చెందిన హువావీ సంస్థ 5జీ యూజ్ కేస్ డెమోలను ప్రదర్శించింది. గృహాలు, కార్లు, ఇతరత్రా వాటిని అనుసంధానించేలా డెమో చూపించింది. ఇక వచ్చే ఏడాది జనవరి-మార్చిలో దేశంలో తొలి భారీ స్థాయి 5జీ ట్రయల్స్‌ను ప్రారంభిస్తామని సామ్‌సంగ్ ప్రకటించింది.