జగన్ పై దాడి చేసింది వీరాభిమాని !

ప్రతిపక్ష నేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరగడం విస్మయం కలిగిస్తున్నది.  దాడి చేసిన వ్యక్తి జగన్ వీరాభిమాని అని తెలియడంతో మరింత గందరగోళం సృష్టిస్తున్నది. ప్రచారం కోసమే దాడి చేసిన్నట్లు అనిపిస్తోందని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు.

జగన్‌పై దాడి చేసిన వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా ఠానేలంక గ్రామానికి చెందిన జానిపల్లి శ్రీనివాసరావుగా గుర్తించామని ఠాకూర్‌ చెప్పారు. నిందితుడు దాడికి ఉపయోగించిన కత్తి విమానాశ్రయం లోపలికి ఎలా వచ్చిందనే విషయంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విమానాశ్రయంలో భద్రత మొత్తం సీఐఎస్‌ఎఫ్‌ పర్యవేక్షణలోనే ఉంటుందని చెబుతూ నిందితుడు శ్రీనివాసరావు ఏడాదిగా అక్కడి రెస్టారెంట్‌లో పనిచేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.

నిందితుడి వద్ద 10 పేజీల లేఖ ఉందని, దాన్ని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది రాష్ట్ర పోలీసులకు అందించారని తెలిపారు. ఆ లేఖపై విచారణ జరిపి వివరాలను త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు. పరిస్థితిని బట్టి జగన్‌కు భద్రతను పెంచుతామని ఆర్పీ ఠాకూర్‌ తెలిపారు.

ఎయిర్ పోర్టులో ఘటన జరిగింది కాబట్టి సీఐఎస్ఎఫ్ అధికారులే పూర్తి బాధ్యత తీసుకోవాలని చెబుతూ భారీ భద్రత ఉండే ఎయిర్‌పోర్టు లోపలకు కత్తి ఎలా వెళ్లిందో సీఐఎస్ఎఫ్ వారిని అడుగుతున్నామని పేర్కొన్నారు.

 వైఎస్ జగన్‌కు  హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఎడమ భుజానికి వైద్యులు మూడు కుట్లు వేశారు. 24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలని జగన్‌కు వైద్యులు సూచించారు. జగన్‌ వెంట ఆయన సతీమణి భారతి, బంధువులు ఉన్నారు. ఆస్పత్రి దగ్గర పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి పార్టీ కార్యకర్తలు, నేతలు,  హైదరాబాదులోని లోటస్ పాండ్‌లో ఉన్న ఆయన నివాసానికి, చికిత్స జరుగుతున్న ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జగన్‌ని పరామర్శించేందుకు వివిధ పార్టీల నాయకులు కూడా వస్తున్నారు.

ఈ దాడిపై వైఎస్ జగన్ ట్విట్టర్‌లో స్పందిస్తు తనపై దాడి జరిగిందని తెలిసి చాలా మంది బాధపడుతున్నారని, తాను క్షేమంగా ఉన్నాననే విషయాన్ని వాళ్లకు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.  

భగవంతుడి దయ, ఏపీ ప్రజల ఆశీస్సులే తనను రక్షిస్తున్నాయని జగన్ చెప్పారు. ఇలాంటి పిరికిపంద చర్యలు ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయే తప్ప తాను వెనకడుగు వేసేది లేదని జగన్ స్పష్టం చేశారు.

నిందితుడు శ్రీనివాస్‌ జగన్‌కు వీరాభిమాని అని అతడి సోదరుడు వెల్లడించారు.  సంక్రాంతి పండగ సందర్భంగా ఆరడుగుల జగన్‌ కటౌట్‌ ఏర్పాటు చేసిన తన సోదరుడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ మానసిక ఆరోగ్యం సరిగానే ఉందని, అతడికి ఎలాంటి సమస్యాలేదన్నారు. తమది పేద కుటుంబమని, పనిచేసుకుంటే గానీ పూటగడవని పరిస్థితి తమదని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇలా ఉండగా, జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిని టిడిపి అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సంబంధంలేని విషయమని స్పష్టంచేశారు. ఈ ఘటనను అడ్డంపెట్టుకొని అల్లర్లకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు.

మరోవైపు, జగన్‌పై దాడిని తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ముక్తకంఠంతో ఖండిస్తుండగా ఏపీలో పలు చోట్ల వైసీపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. విషయం తెలిసిన వెంటనే డీజీపీకి స్పష్టమై ఆదేశాలు ఇచ్చామని, ప్రభుత్వం సీరియస్‌గా విచారణ జరుపుతోందని, వాస్తవాలను బయటకు తీసుకొస్తామంటూ పలువురు మంత్రులు చెబుతున్నారు.

ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వైసిపి నేత పార్థసారధి విమర్శించారు. జగన్‌పై దాడిలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనబడుతోందని శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయన వెల్లడించారు. సీఐఎస్‌ఎఫ్‌ నిఘాలో ఉండే విమానాశ్రయంలోకి ఎవరైనా వెళ్లగలిగారంటే, దీనివెనుక పెద్దల హస్తం లేకుండా, కుట్ర లేకుండా సాధ్యం కాదని ఆయన స్పష్టం చేసారు. నిందితుడు వీఐపీ లాంజ్‌లోకి వెళ్లి దాడి చేయగలిగాడంటే భద్రతా వైఫల్యం పూర్తిగా కనడుతోందని చెప్పారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ప్రతిపక్ష వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మరోవంక బిజెపి అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ జీవీఎస్‌ నరసింహరావు పేర్కొన్నారు. ఈ దాడిని అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించాలని కోరుతూ సురక్షితంగా భావించే విమానాశ్రయంలోనే దాడి జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్‌ చేశారు.