ప్రధాని రేస్ లో రాహుల్ వెనుకడుగు..పొత్తులకు ప్రతికూలత

కర్ణాటకలో కేవలం 38 సీట్లు మాత్రమె గెల్చుకున్న పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా 80 సీట్లు గెల్చుకున్న పార్టీ అధినేతగా రాహుల్ గాంధీ చాలా ఉదారంగా వ్యవహరించారని పేరు తెచ్చుకున్నారు. బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో `మహాగటబంధన్’ ఏర్పాటు చేయడం కోసం ఆయన ఈ విధమైన చోరువ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. దానితో ప్రధాన మంత్రి అభ్యర్ధిగా రాహుల్ గాంధీకి మద్దతు కూడదీయడంలో కీలక మైన మలుపు తిరిగిన్నట్లే అని అందరూ భావించారు.

అయితే పరిస్థితులు అనూహ్యంగా మారాయి. రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదని అంటూ మాజీ ఆర్ధిక మంత్రి పి చిదంబరం ప్రకటించారు. అంతకు రెండు వారల ముందు హిందూస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో ప్రతిపక్షాలు ప్రతిపాదిస్తే తాను ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి సిద్దంగా ఉన్నానని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పడాన్ని ఎవ్వరు మరచిపోలేదు. ఆ తర్వాత రెండు రోజులకే రాహుల్ గాంధీ కి అటువంటి అవకాశమే లేదని ఎన్సిపి నేత శరద్ పవర్ కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పేశారు. పైగా రాఫేల్ డీల్ గురించి నిత్యం రాహుల్ చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ “ఆయన వద్ద ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయి ఏమో. నా వద్ద మాత్రం లేవు” అని స్పష్టం చేసారు. ఇదంతా చూస్తుంటే రాహుల్ ను ప్రధాన మంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్ మిత్ర పక్షాలు సహితం ఎవ్వరు ఒప్పుకోవడం లేదు. దానితో ఈ విషయంలో వెనుకడుగు వేయక ఆ పార్టీకి తప్పడం లేదు.

మరోవంక ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో లోక్ సభ ఎన్నికలకు ముందుగా `మహాగటబంధన్’లను ఆయా రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రతిపక్షాలకు కేంద్ర బిందువుగా కాంగ్రెస్ ను మార్చాలని రాహుల్ వేసిన ఎత్తుగడకు బిఎస్పి అధినేత్రి మాయావతి గండి కొట్టారు. ఆ పార్టీతో పొత్తు లేదని ఏకపక్షంగా ప్రకటించడమే కాదు తమ దారి తాము చూసుకొంతున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ఈ రాష్ట్రాలలోనే ఇతర పక్షాలు కలసి పోటీ చేయడానికి సిద్ద పడటం లేదు. ఇక మిగిలిన రాష్ట్రాల సంగతి చెప్పనవసరం లేదు.

దానితో ప్రస్తుతానికి `మహాగటబంధన్’ ఆలోచనలకు కాంగ్రెస్ స్వస్తి పలుకుతున్నది. అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించడం ద్వారా ముందుగా తమ బలాన్ని స్తిరీకరించుకొనే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ తో పాటు బిజెపి కూడా మిత్ర పక్షాలతో సీట్ల సర్దుబాటు గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి వారు ఈ విషయమై వత్తిడి తెస్తున్నా ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలలో తీరిక లేకుండా ఉన్నాను, ఎన్నికల తర్వాత చూడడంలో అని బిజెపి అద్యక్షుడు అమిత్ షా దాటవేస్తున్నారు.

ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో సంబంధం లేని పక్షాలు సహితం ఎన్నికల తర్వాత పొత్తుల సంగతి చూద్దాంలే అనే ధోరణిలో వ్యవహరించడం గమనార్హం. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఒక విధంగా కాంగ్రెస్ అస్తిత్వ సమస్యను ఎదుర్కొంటున్నది. రాహుల్ గాంధీ పార్టీ అద్యక్ష పదవి చేపట్టిన తర్వాత మొదటి సారిగా జరుగుతున్న ఎన్నికలు. కనీసం ఒకటి, రెండు రాష్త్రాలలో అయినా కాంగ్రెస్ అధికారం చేపట్టలేని పక్షంలో మరో ప్రాంతీయ పార్టీగా మారి పోవలసిందే. ఇక పొత్తుల విషయంలో ప్రాంతీయ పార్టీలు చెప్పిన్నట్లు వినక తప్పని పరిస్థితి. అటువంటప్పుడు ప్రధాన మంత్రి పదవి వైపు చూసే అవకాశం కూడా ఉండదు.

చివరకు ఈ ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని ఉత్తర ప్రదేశ్ లో సహితం ప్రతిపక్షాలు పొత్తుల విషయంలో ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. పొత్తుల విషయమై అఖిలేష్ యాదవ్, మాయావతి, అజిత్ సింగ్ ఇప్పటికే మాట్లాడుకొన్నా ఇంకా ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు. అదే విధంగా పొత్తుల విషయంలో బీహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, మహారాష్ట్ర కుడా కీలకమైనవే. ఈ రాష్త్రాల ఫలితాలు 2019 ఎన్నికలపై నిర్ణయాత్మక ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి ఘన విజయం సాధిస్తే మహారాష్ట్రలో శివసేన, బీహార్ లో జేడియులను లెక్క చేయవలసిన అవసరం ఉండదు. తమ షరతులకు లోబడి వారుంటే సరే. లేని పక్షంలో ఒంటరిగా పోటీ చేయడానికి బిజెపి సిద్ద పడుతుంది. అట్లా గాక, కనీసం రెండు రాష్ట్రాలలో అయినా అనుకోని పరాజయం ఎదురైతే శివసేన, జేడియుల డిమాండ్ లకు తలొగ్గి వారితో అవగాహనకు రాక తప్పదు. అందుకనే 2019 ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై అనూహ్య ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

అదేవిధంగా కాంగ్రెస్ సహితం కనీసం రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పక్షంలో బీహార్ లో నితీష్ కుమార్ ను మహాకుటమిలోకి తీసుకు రావడం కోసం చేస్తున్న ప్రయత్నాలకు లాలూ ప్రసాద్ కుమారులు అడ్డు పడతారు. బెంగాల్ లో మమత బెనర్జీ పోత్తులకు ఏమాత్రం ఒప్పుకోరు. ఉత్తర ప్రదేశ్ లో సహితం నాలుగైదు సీట్లకు పరిమితం కావలసిందే. ఇక మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటులో శరద్ పవార్ దే పై చేయి అవుతుంది. కర్ణాటకలో జెడిఎస్ అడిగినన్ని సీట్లు ఇవ్వక తప్పదు. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాలపై నాలుగైదు సీట్లకు పరిమితం కావలసి ఉంటుంది.

తెలంగాణ, రాజస్తాన్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు జరిగితే రాహుల్ గాంధీ ప్రాధాన్యత ప్రతిపక్షలలో ఒకేసారి పెరుగుతుంది. సీట్ల సర్దుబాటులో పై చేయి కాగలదు. మరిన్ని కొత్త పక్షాలు కాంగ్రెస్ తో పోత్తులకు సిద్దం కాగలవు. అందుకనే ఈ ఎన్నికల ఫలితాల పట్ల ఒక వంక బిజెపి, మరో వంక కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. బిజెపి వ్యూహంలో సహితం తెలంగాణ, మిజోరాంలలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం కాకుండా కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం కోసమే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది.