పంచాయతీరాజ్‌ చట్టాన్ని అపహాస్యం చేశారు : కన్నా

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులను కాదని జన్మభూమి కమిటీలకు పెత్తనం కట్టబెట్టి పంచాయతీరాజ్‌ చట్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అపహాస్యం చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రికి వారానికో లేఖ రాస్తున్న కన్నా బుధవారం 17వ లేఖను సంధించారు.

ప్రభుత్వ పనితీరు బాగుందని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

భారత దేశ చరిత్రలో ప్రజస్వామ్యబద్దంగా ఎన్నిక కాబడిన గ్రామసర్పంచులకు మీరు చేసినంత అన్యాయం మరెవరైనా చేశారా? వాళ్లను పక్కన పెట్టి, జన్మభూమి కమిటీల పేరుతో సర్పంచుల హక్కులను హరించారు గదా, పంచాయతీరాజ్‌ చట్టాన్ని నిర్వీర్యం చేశారు గదా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఇప్పుడు 20, 30 నెలల నుంచి వాళ్లకు జీతాలు కూడా లేక పోగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయి బ్రహ్మాండంగా ఉందని ఎట్లా గొప్పలు చెప్పుకుంటున్నారని నిలదీసారు. మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారో ప్రజలకు వివరించగలరా? అని సవాల్ చేశారు.

 రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల కేటాయింపులు సీఎం కుమారుడికి కలెక్షన్‌ కేంద్రాలుగా మారిపోయాయని కన్నా ఆరోపించారు. కృష్ణానదిపై వైకుంఠపురం బ్యారేజీ అంచనాలను రెండుసార్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. కుప్పం నియోజకవర్గంలో క్రికెట్‌ కిట్ల పంపిణీలో అవినీతి జరిగిందని ద్వజమెత్తారు.

రాష్ట్రంలో ప్రతిప్రాజెక్టు మీకూ, మీ కుమారునికీ, మీ మంత్రులకూ అనుచరులకూ, కలెక్షన్లకూ కేంద్రమైందని సిఎంను నిలదీశారు. ప్రాజెక్ట్ లు అన్నింటిని బినామీలకు అప్పగించడం, అంచనాలు పెంచడం, నిధులన్నీ దోచి పెట్టడం, ఆ నిధులన్నీ మరలా ముఖ్యమంత్రి వద్దకే చేరడం జరుగుతున్నదని ద్వజమెత్తారు. . ఇష్టారాజ్యంగా మీ అస్మదీయులకు దోచిపెట్టడం, ప్రశ్నిస్తే తెలుగు జాతి మీద దాడి అని ఎదురు దాడి చేయడం మీకు పరిపాటి అయిందని దయ్యబట్టారు. . తెలుగు జాతి గౌరవాన్ని మీ స్వార్ధానికి బలి చేస్తున్నారంటే కాదని చెప్పగలరా? ఈ విషయంపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని సవాల్ చేసారు.

మీరు, మీ కుమారుడు, మీ అనుచరులు, మీ చెంచా మీడియా అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా ఐటీ దాడులు చేయిస్తుందని గగ్గోలు పెట్టారని, మీ బినామీ రమేష్‌ మీసాలు కూడా తిప్పుతున్నారని పేర్కొంటూ గత ఆరు సంవత్సరాల్లో ఎండ్కో (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు సిఎం రమేష్ రిత్విక్ సంస్థ రూ 12 కోట్లు చెల్లిస్తే, ఆ చిరునామాతో ఆ కంపనియే లేదని, ఆ సంస్థ ప్రతినిధి సాయిబాబా రిత్విక్ కంపెనీ అకౌంటెంట్ కాదని మీరు చెప్పగలరా అని నిలదీశారు.

సూట్‌ కేసు కంపెనీలకు చెల్లించిన డబ్బు విచారణ చేయించుకోగలరా?  అని సవాల్ చేసారు. ఈ కోట్లాది రూపాయలేగా ఎంఎల్‌ఏలను కొనటానికి ఉపయోగించిందని ఆరోపిస్తూ తెలంగాణాలో రేవంత్‌ రెడ్డి చేత పంపిన యాభై లక్షలు కూడా అవే గదా అని అడిగారు. ఏపీని నిలువునా దోచి, వేల కోట్ల కాంట్రాక్టులను మీ బినామీ అయిన రమేష్‌ కంపెనీలకు ఇష్టారాజ్యంగా ఇచ్చి అక్కడ నుంచి మీరు వెనక్కు తెచ్చుకోవడం. ఏమి నైపుణ్యం అని ప్రశ్నించారు. ఇలాంటి అనాగరిక సంస్కారహీనుడైన వ్యక్తి రాజ్యసభకా? ఆయనకున్న అర్హత మీ బినామీ కావడమే. అలా పంపినందుకు ముందు ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఆ తర్వాత అతని చేత రాజీనామా ఇప్పించండని డిమాండ్ చేసారు.

ఓ వైపు కేంద్రం సాయం చేయడం లేదని టిడిపి నేతలు చెబుతుంటే, మరోవైపు ఉపాధి హామీ నిధులు దేశంలోనే అత్యధికంగా ఏపీకి వచ్చాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఎపి జాతీయ గ్రామీణ ఉపాధి పధకం కింద అత్యధికంగా నిధులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు గదా అని కన్నానిలదీశారు. చంద్రబాబు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.