కాషాయ తెలంగాణగా మారబోతుంది : స్వామి పరిపూర్ణానంద

ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఎన్నికలలో ప్రపంచమే అబ్బుర పరచే విధంగా ఫలితాలు సాధిస్తామని చెబుతూ తెలంగాణ `కాషాయ తెలంగాణ’గా మారబోతున్నదని స్వామి పరిపూర్ణానంద ప్రకటించారు. గతవారం ఢిల్లీలో బిజెపి అద్యక్షుడు అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరిన ఆయన తొలిసారిగా బుధవారం హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యలయంకు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

ఈ ఎన్నికల అనంతరం తెలంగాణలో ప్రజా ప్రభుత్వం, బిజెపి ప్రభుత్వం ఏర్పర్చడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. తెలంగాణలో రాజకీయ కురుక్షేత్రం ప్రారంభం అయిందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్వామి భరోసా వ్యక్తం చేశారు.  తాను పార్టీలో ఏ పదవి కోరుకోవడం లేదని, ప్రజలందరికి పార్టీ సందేశం చేరవేయడమే తన ముందున్న లక్ష్యమని తెలిపారు. తనను హైదరాబాద్ నుండి కెసిఆర్ ప్రభుత్వం బహిష్కరించడాన్ని ప్రస్తావిస్తూ ఆ బహిష్కరనే `అమిత్ షా ఆవిష్కరణ’కు దారి తీసిన్నట్లు తనను రాజకీయాల్లో ప్రవేశించడానికి ప్రేరేపించినదని సంకేతం ఇచ్చారు.

ఇప్పుడు తెలంగాణలో `దార్ సలాం’ ప్రభుత్వం ఉన్నదని ద్వాజమేత్తుతూ మజ్లిస్ కు దాసోహమైన కెసిఆర్ అధికారంలో ఉన్నట్లు ప్రస్తావించారు. అయితే ఎన్నికల అనంతరం `లాల్ సలాం’ (బిజెపి) ప్రభుత్వం వస్తుందని భరోసా వ్యక్తం చేసారు. తన ప్రచారం ద్వారా ఓటర్లనే పార్టీ కార్యకర్తలుగా మారుస్తానని చెబుతూ ఇప్పుడున్న బిజెపి కార్యాలయాలు సరిపోవని, ప్రతి వీధిలో, గ్రామంలో ఒకొక్క కార్యాలయం ఏర్పాటు చేయవలసి వస్తుందని పేర్కొన్నారు.

`తెలంగాణ మిషన్ 70’ని ప్రస్తుత ఎన్నికలలో సాకారం చేసుకొంటామని ధీమా వ్యక్తం చేస్తూ గత 25 ఏళ్లుగా దళిత వాడలు, నిరాదరణకు గురైన బస్తీల్లో తిరిగానని, అక్కడి పరిస్థితులు చూసి తీవ్రంగా చలించానని చెబుతూ బడుగుల జీవితాలు బాగుపడాలంటే ఆధ్యాత్మిక శక్తితో పాటు రాజకీయ వేదిక కావాలనే బిజెపిలో చేరిన్నట్లు తెలిపారు. కేవలం తన ప్రవచనాలు సరిపోవని భావించి దీనిపై స్పందించే హృదయం.. ఉన్నత ప్రమాణాలతో నిర్మించే వ్యవస్థ కావాలని గ్రహించి రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

బీజేపీలో కులాలు, కుటుంబాలు లేవని, అవినీతి లేదని, గుణమే హద్దని అంటూ  “తెలంగాణలో జనతా సర్కార్ రావాలి.. పరివార సర్కార్ పోవాలి.. అదే మా నినాదం” అని ప్రకటించారు. కాగా, రాష్ట్ర బీజేపీలో పరిపూర్ణానంద కీలక బాధ్యత నిర్వర్తిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ప్రకటించారు.