‘బెయిల్‌ గాడీ’ లను జైలుకు పంపితే బిజెపికి 350 సీట్లు

రానున్న సార్వత్రిక ఎన్నికలలో బిజెపి 350 సీట్లు సాధించుకోవడం తధ్యమని  పార్టీ ఎంపీ డా. సుబ్రహ్మణ్యన్ స్వామి భరోసా వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణం సహా బయట తిరుగుతున్న ‘బెయిల్‌ గాడీ’ (అవినీతికి పాల్పడి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న కాంగ్రెస్‌ నేతలు) తిహార్‌ జైలుకు వెళ్లడం వంటివి జరిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి 350 సీట్లు వస్తాయని స్పష్టం చేశారు. 

యువతలో జాతీయవాదం, హిందుత్వవాదం పెరగడం లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి  గెలిచేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బుధవారం ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘‘2019 ఎన్నికల్లో బిజెపి  గెలిచేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే యువతలో జాతీయవాదం, హిందుత్వ భావాలు పెరగడమే ఇందుకు కారణం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగి, ‘బెయిల్‌గాడీ’ తీహార్‌ జైలుకు వెళ్తే బిజెపి  సులువుగా 350 సీట్లు తన ఖాతాలో వేసుకుంటుంది. గతంలో నేరాలు చేసిన కొంతమంది కాంగ్రెస్‌ నేతలు, మాజీ మంత్రులు ఇప్పుడు బెయిల్‌పై తిరుగుతున్నారు. వారిని బెయిల్‌ గాడీగా పిలుస్తున్నాం’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

గత జులైలో రాజస్థాన్‌లోని జయపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ ‘బెయిల్‌ గాడీ’ అనే మాట వాడారు. గతంలో వివిధ రకాల నేరాలు చేసిన కాంగ్రెస్‌ నేతలు, మాజీ మంత్రులను కలిపి ఆయన బెయిల్‌ గాడీగా అభివర్ణించారు. అప్పటి నుంచి బెయిల్‌గాడీ అనే మాట జనం నోట్లోనూ నానుతూ వస్తోంది.