నిఘా నేత్రంగా మారుతున్న గూగుల్

 

గూగుల్ సంస్థ దొంగచాటుగా మన కదలికలను రికార్డు చేస్తున్నది. జీపీఎస్ ఆఫ్ చేసినా, లొకేషన్ హిస్టరీ క్లోజ్ చేసినా, హిస్టరీ క్లియర్ చేసినా, సెట్టింగ్స్ ఆఫ్ చేసినా ఫలితం ఉండ టం లేదు. మన ఫోన్‌లోని మిగతా గూగుల్ యాప్స్ సహాయంతో మనం ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నామో రికార్డు చేస్తున్నది. ఆండ్రాయిడ్ ఫోన్‌లతోపాటు ఐఫోన్‌లపైనా గూగుల్ ఐ నిరంతరం కొనసాగుతున్నది.

అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ) పరిశోధనలో తేలిన కఠిన వాస్తవాలు ఇవి. వినియోగదారుల గోప్యతకు గూగుల్ కనీస గౌరవం ఇవ్వడం లేదని తేల్చింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల మంది ఆండ్రాయిడ్ ఫోన్ల, గూగుల్ యాప్స్ వినియోగిస్తున్న ఐఫోన్ వినియోగ దారుల ప్రైవసీకి భంగం వాటిల్లుతున్నదని పేర్కొన్నది.

అసోసియేటెడ్ ప్రెస్ విన్నపం మేరకు ప్రిన్‌స్టన్ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం పరిశోధకులు పరిశోధన జరిపారు. యూనివర్సిటీకి చెందిన ఒక పరిశోధకుడు తన ఆండ్రాయిడ్ ఫోన్‌లో లొకేషన్ హిస్టరీని ఆఫ్ చేసి వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. ఆ తర్వాత ఫోన్‌లో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించి విశ్లేషించగా ఆయన న్యూయార్క్-ప్రిన్‌స్టన్ మధ్య రెండుసార్లు రైలులో తిరిగినట్టు, హైలైన్ పార్క్, చెలెసా మార్కెట్, హెల్స్ కిచెన్ తదితర ప్రాంతాల్లో తిరిగినట్టుగా నమోదై ఉన్నది. ఆయన తన ఇంటికి, ఆఫీస్‌కు ఎన్నెన్నిసార్లు వెళ్లారో కూడా రికార్డయ్యింది. గూగుల్ మ్యాప్స్, సెర్చ్ వంటి యాప్స్ వాడుతున్న ఐఫోన్‌లలోనూ వివరాలు రికార్డయినట్టు గుర్తించారు.

 

యాప్స్ చాలామటుకు మనం ఎక్కడున్నామో తెలుసుకొనేందుకు యూజ్ యువర్ లొకేషన్ ఆప్షన్ ఇస్తాయి. గూగుల్ మ్యాప్స్ అయితే మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం వంటి వివరాలను నిరంతరం నమోదు చేస్తుంది. మనం రోజువారీగా సందర్శించే ఇల్లు, ఆఫీస్ ప్రాంతాలను, ఏయే సమయాల్లో వెళ్తున్నాం వంటి వివరాల ఆధారంగా తరువాత అలర్ట్స్ కూడా ఇస్తుంది. లొకేషన్ హిస్టరీలో మనం ఎక్కడెక్కడికి వెళ్లామో క్షుణ్ణంగా రికార్డు అవుతుంది. పాజ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే వినియోగదారుల కదలికలను రికార్డు చేయమని, హిస్టరీని క్లియర్ చేస్తే ఆ వివరాలన్నింటినీ తుడిచి వేయొచ్చని గూగుల్ చెప్తున్నది.

 

అయితే ఇది నిజం కాదని పరిశోధకులు చెప్తున్నారు. లొకేషన్ హిస్టరీని పాజ్ చేసినా మనం ఏ క్షణంలో ఎక్కడ ఉన్నామో మన అనుమతి లేకుండానే ఇతర యాప్స్ సాయంతో గూగుల్ రికార్డు చేస్తున్నదని చెప్తున్నారు. ఉదాహరణకు మనం ప్రయాణిస్తున్నప్పుడు ప్లేస్టోర్ ఓపెన్ చేసినా, మ్యాప్స్ ఓపెన్ చేసినా మన కదలికలు రికార్డ్ అవుతున్నాయి. గూగుల్ సెర్చ్‌లో ఏదైనా స్టోర్ లేదా ఇతర సమాచారం కోసం వెతికితే మనం ఎక్కడున్నామో అక్షాంశాలు, రేఖాంశాల వివరాలతో సహా నమోదవుతున్నది. ఇక వాతావరణ వివరాలు అందించే యాప్ గూగుల్ మ్యాప్స్‌తో సంబంధం లేకుండా మనం ఏ ప్రాంతంలో ఉన్నామో గుర్తుపట్టేస్తున్నది.

 

ఈ వివరాలన్నీ మన గూగుల్ ఖాతాలో నిక్షిప్తం అవుతున్నాయని ప్రిన్‌స్టన్ కంప్యూటర్స్‌కు చెందిన శాస్త్రవేత్త జోనాథన్ మేయర్ స్పష్టం చేసారు. గూగుల్‌కు మన సమాచారాన్ని సేకరించేందుకు పలు మార్గాలు ఉన్నాయని తెలిపారు. లొకేషన్ హిస్టరీ, వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ, డివైజ్ లెవల్ లొకేషన్ సర్వీసెస్ వంటి ఆప్షన్ల ద్వారా ఎక్కడున్నారో గుర్తిస్తున్నదని చెప్పారు. వీటిని ఆఫ్ చేయడంతోపాటు హిస్టరీ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఎంపిక చేసుకొని తొలిగిస్తేనే నిఘా ఆగుతుందని పేర్కొన్నారు.