కాశ్మీర్ లో శాంతి కోసం ఎవరితోనైనా చర్చలకు కేంద్రం సిద్ధం

కాశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి పాకిస్తాన్ సహా ఎవరితోనైనా చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్ లో ప్రకటించారు. అయితే ఒకపక్క ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతుంటే చర్చలు కొనసాగవని, ఈ రెంటికీ ఎప్పుడూ పొంతన కుదరదని తేల్చి చెప్పారు.

శ్రీనగర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికలలో పాల్గొనాలని అభ్యర్థించారు. ఎంత కఠిన సమస్యనైనా, సవాళ్లనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతామని హితవు చెప్పారు. అలాగే కాశ్మీర్‌కు సంబంధించిన చాలా సమస్యలను ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే నివృతి చేసుకోవచ్చునని అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేని వ్యక్తులు ప్రజల సంక్షేమాన్ని కాంక్షించలేరని ఆయన ద్వజమెత్తారు.

రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అన్ని వర్గాలతోనూ చర్చలు జరపడానికి కేంద్రానికి ఎలాంటి సమస్యా లేదని రాజనాథ్ సింగ్ స్పష్టం చేసారు. అయితే భారతదేశంలో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచిపోషిస్తోందని, అలాగే దీనికి సంబంధించి అన్ని విధాలుగా మద్దతు ఇస్తోందన్న వాస్తవాన్ని మరచిపోకూడదని హోం మంత్రి హెచ్చరించారు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటే పాకిస్తాన్ చర్యలను ఎదుర్కోగలుగుతామని భరోసా వ్యక్తం చేసారు. వేర్పాటువాదులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నకు శాంతిసాధనకు ఎవరితోనైనా చర్చిస్తామని రాజ్‌నాథ్ తెలిపారు.

రాష్ట్రంలో బద్రతాపరమైన పరిస్థితులను గవర్నర్ సత్పాల్ మాలిక్, ఇతర ఉన్నత అధికారులతో సమీక్షిస్తూ పంచాయత్ ఎన్నికలను ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు అవకాశం లేకుండా విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థలకు సహితం విశేషంగా అధికారాల బదిలీ ద్వారా స్థానంగా ఎదురయ్యే పలు సమస్యలను ఆ స్థాయిలోనే పరిష్కరించ వచ్చని సూచించారు.

ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో రాళ్ళూ రవ్వే సంఘటనలు తగ్గుముఖం పట్టాయని, అట్లాగే ఉగ్రవాదులతో యువత చేరడం కుడా తగ్గినదని రాజనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 2.5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే ప్రత్యేక పధకాన్ని కేంద్రం రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర పాలనా యంత్రాంగంలో పేరుకుపోయిన అవినీతిని కట్టడి చేయడం కోసం త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా భారత్ గుర్తింపు పొదుతున్నా అటువంటి అభివృద్ధి సూచికలు జమ్మూ కాశ్మీర్ లో కనిపించక పోవడం పట్ల రాజనాథ్ విచారం వ్యక్తం చేసారు. ఈ రాస్త్రాన్ని కుడా అభివృద్దిలో ముందుండే విధంగా చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

కాగా, ప్రస్తుతం సంఘర్షణలకు స్వస్తి చెప్పేందుకు వీలుగా పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని కేంద్రాన్ని కోరారు. రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన చర్చల్లో ఆమె ఈమేరకు అభ్యర్థన చేశారు. రాష్ట్రానికి చెందిన అనేకమంది రాజకీయ నాయకులు రాజ్‌నాథ్‌ను కలుసుకోవడంతో పాటు రాష్ట్ర పరిస్థితిపై చర్చించారు. పాకిస్తాన్‌తో సత్సంబంధాలు కొనసాగితే పరిస్థితిలో గుణాత్మక మార్పు వస్తుందని రాజ్‌నాథ్‌కు మెహబూబా స్పష్టం చేసినట్టు పీడీపీ ఒక ప్రకటనలో తెలిపింది.