తెలంగాణలో కుటుంబపాలనకు చరమగీతం పాడాల్సిందే

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కుటుంబపాలనకు చరమగీతం పాడాల్సిందేనని తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పిలుపిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సదస్సులో నడ్డా మాట్లాడుతూ దేశంలోగానీ, ఏ రాష్ట్రంలోగానీ ఒక కుటుంబ పాలన మంచిది కాదని స్పష్టం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా కుటుంబపాలన నాలుగేళ్లుగా కొనసాగిందని ద్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుటుంబపాలనపై ఉన్నంత దృష్టి ప్రజల అభివృద్ధిపై పెట్టలేదని దయ్యబట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి రాజ్యమేలిందని, అందుకే కేసీఆర్‌ను అధికారానికి దూరం పెట్టడానికి ప్రజలు నిర్ణయించుకున్నారని నడ్డా స్పష్టం చేసారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రూ. 2.71 లక్షల వేల కోట్లు నిధులు ఇచ్చిందని తెలిపారు. కానీ కేసీఆర్ మాత్రం కేంద్రం నిధులు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు రాష్ట్రానికి ఇచ్చిందో ప్రతి పైసాకు లెక్కపక్కాగా ఉందని ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవుపలికారు. కేంద్రం నుండి దండిగా నిధులు తీసుకుంటూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో పేద ప్రజలకు లక్ష ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఖర్చు చేయకుండా ఉండి పేదలకు అన్యాయం చేసింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పాలమూరులో వలసలు పెరుగుతున్నాయని మంత్రి జేపీ నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పాలకుల వివక్షకు గురైందని తెరాస ఆరోపిస్తోంది. గత నాలుగున్నర ఏళ్లుగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నువ్వు పాలమూరు వలసలను ఎందుకు ఆపలేకపోతున్నావు’ అని కేసీఆర్‌ను నడ్డా ప్రశ్నించారు.

ఈ ప్రాంతానికి చేస్తున్న సాగునీటి సరఫరాపై ప్రభుత్వం వద్ద సరైన లెక్కలే లేవన్నారు. ఒకసారి జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని, మరోసారి అయిదు లక్షల ఎకరాలకు ఇచ్చామని, ఇంకోసారి 11 లక్షల ఎకరాలకు ఇచ్చామని ప్రభుత్వం అంటోందని ద్వజమెత్తారు.  ‘కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు ఎక్కడికి పోయాయి? పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఏమయ్యాయి? సాగునీటి పథకాల పనులు ఎందుకు పూర్తి చేయలేదు?’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీటి కోసం కేంద్రం నిధులు ఇచ్చినా వాడుకోలేదని విమర్శించారు.

జిల్లాలో పారుతున్న కృష్ణానది నీటిని సక్రమంగా వినియోగించుకోవడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని దయ్యబట్టారు. దీంతో వలసలు మరింత పెరిగాయన్నారు. ‘ఇప్పటివరకు మహబూబ్‌నగర్‌కు ఒక్క పారిశ్రామికవాడైనా వచ్చిందా? పరిశ్రమలు ఏమైనా వచ్చాయా? కార్మికులకు ఉపాధి లభించిందా?’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు.

 పార్లమెంట్. అసెంబ్లీ ఎన్నికలు రెండూ ఒకేసారి జరిగితే ప్రధానమంత్రి మోదీ చరిష్మా ముందు తాము తట్టుకోలేకపోతామని, తెలంగాణలో సైతం బీజేపీ గెలుస్తుందని భయపడే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో ఇప్పటి వరకు సరైన సమాధానం ప్రజలకు చెప్పలేకపోయారని ద్వజమెత్తారు.

అంతేకాకుండా తెలంగాణకు కృష్ణా జలాల వాటా గురించి కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా తమ వాదనను వినిపించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి విమర్శించారు. ఏ రాష్ట్రంలో చూసినా ఇంకా మహబూబ్‌నగర్ వలస కూలీలు ఇంకా ఉన్నారంటే అది కేసీఆర్ చేతగాని తనమేనని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఉపాధి కల్పించడంలో కూడా కేసీఆర్ వైఫల్యం చేందారని తెలిపారు.

దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అన్ని రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అందులో తెలంగాణలో అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చితీరుతుందని నరేంద్రమోదీ మరోసారి ప్రధాన మంత్రిగా కూడా ఉంటారని దాంతో తెలంగాణ అభివృద్ధికి మరింత చేయూతను అందిస్తామని భరోసా ఇచ్చారు.