సెప్టెంబర్ 25న జన్ ఆరోగ్య అభియాన్ ప్రారంభం

ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా ప్రకటించారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం సందర్భంగా ఈ పథకాన్ని మోదీ ప్రకటించారు. సెప్టెంబర్ 25న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా పేదలందరికీ ఉచితంగా వైద్యసాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

 

తొలి విడుతలో 10 కోట్ల మందితో ఈ పథకం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ పథకం అమలు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామన్నామని పేర్కొన్నారు.  అవసరమైన వైద్య సిబ్బంది, సదుపాయాలు కల్పిస్తామని మోదీ పేర్కొన్నారు.

 

“రోగమొస్తే ఏం చేయాలన్న భయం పేద ప్రజల్లో ఉండకూడదు. పేదలు పేదరికంలోనే మరణించకూడు. గడిచిన నాలుగేళ్లలో పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నించాం. గడిచిన రెండేళ్లలో 5 కోట్ల మంది దారిద్య్ర రేఖకు ఎగువకు చేరుకున్నారు” అని మోదీ వెల్లడించారు. ఆరోగ్య భారత్ లక్ష్యంగా ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకం పని చేస్తుందని మోదీ స్పష్టం చేశారు.

అణగారిన వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పాటుపడుతున్నదని చెబుతూ అభివృద్ధిలో దేశం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అహర్నిశలు శ్రమిస్తున్నామని తెలుపుతూ స్వప్పాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం శ్రమిస్తోందని చెప్పారు. 12 ఏళ్లకోసారి పుష్పించే నీలగిరి పుష్పాల మాదిరిగా దేశం వికసిస్తోందని చెబుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని కొనియాడారు. ఎవరెస్టుపై మన బాలికలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆత్మవిశ్వాసాన్ని చాటారని ప్రశంసించారు.

పార్లమెంట్ సమావేశాలు అత్యంత ఫలప్రదమయ్యాయని సంరుప్తి వ్యక్తం చేసారు. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల సమస్యలపై సుదీర్ఘ చర్చ సాగిందిని అంటూ ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో సామాజిక న్యాయం సాధించామని, ఓబీసీ కమిషన్ బిల్లును ఆమోదించామని తెలిపారు.

దేశం ఒక సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని పేర్కొంటూ  దేశ రక్షణలో త్రివిధ దళాలు ఆత్మార్పణ చేస్తున్నాయని చెప్పారు. త్యాగధనులందరికీ దేశ ప్రజల పక్షాన ప్రణామం చేస్తున్నామని తెలిపారు. దేశంలో వర్షాలు పడుతున్నాయన్న శుభవార్త ఒకవైపు ఉండగా, మరోవైపు వరదలు వస్తున్నాయన్న బాధ కలుగుతోందని చెప్పారు. ఎన్నో సవాళ్లు, అడ్డంకులను అధిగమించామని అంటూ అందరికీ న్యాయం, అందరూ అభివృద్ధి పథంలో ముందకు సాగాలని స్పష్టం చేసారు. “దేశమంతటా విద్యుత్ వెలుగులు నింపాం. డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్నాం. ఇండియన్ నేవీలో ఆరుగురు మహిళలు సేవలందించడం గౌరవంగా భావిస్తున్నా” అని ప్రధాని పేర్కొన్నారు.  

ప్రతీ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యం సాకారమవుతోందని ప్రధాని ప్రకటించారు. ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించాలన్న స్వప్నాన్ని నాలుగేళ్లలో సాకారం చేశామని గుర్తు చేసారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మించాలన్నదే లక్ష్యం. ఇంటింటికి గ్యాస్ కనెక్షన్, ఆప్టికల్ ఫైబర్ లక్ష్యాలు నెరవేరుతున్నాయని సంతోషం వ్యక్తం చేఆరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియా మాదిరిగా పని చేస్తున్నాయని అంటూ కొత్త ఐఐటీ, ఐఐఎంలు సహా అనేక విద్యా సంస్థలకు రూపకల్పన జరుగుతోందని తెలిపారు.

డిజిటల్ ఇండియా కార్యక్రమం అత్యంత వేగంగా సాగుతోందని పేర్కొంటూ గొప్ప గొప్ప నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా పూర్తవుతున్నాయని, రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారని వివరించారు.  సూక్ష్మ బిందు సేద్యంతో వ్యవసాయ రంగంలో కొత్త పుంతలు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించిన తమ ప్రభుత్వానిదే. రైతులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని మోదీ వ్యాఖ్యానించారు.

జీఎస్టీ తీసుకువచ్చే క్రమంలో అనేక సవాళ్లను అధిగమించామని చెబుతూ అన్నింటినీ పక్కనబెట్టి జీఎస్టీని అమలు చేసి చూపించామని ప్రధాని చెప్పారు. కోట్లాది చిన్న వ్యాపారుల సహకారంతో జీఎస్టీని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఇవాళ రికార్డు స్థాయిలో ఆహారధాన్యాలు ఉత్పత్తి చేస్తోందని అంటూ ఆహార ధాన్యాలతో పాటు మొబైల్ ఫోన్లనూ ఉత్పత్తి చేస్తుందని ప్రకటించారు.  జాతీయ రహదారుల విస్తరణ దేశంలోని ప్రతి మూలను కలుపుతోందని అంటూ 2014 తర్వాత భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తుందని మోదీ స్పష్టం చేశారు. మహిళా సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని తెలిపారు.

దివాళా, బినామీ ఆస్తుల బిల్లులతో అక్రమార్కుల భరతం పట్టే ప్రయత్నం చేస్తున్నామని చెబుతూ “మేం పార్టీ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం పని చేయం. దేశ అభివృద్ధి ప్రయోజనాలే మిన్నగా మా నిర్ణయాలు ఉంటాయి” అని మోదీ స్పష్టం చేశారు.