అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువను ఏ ప్రాతిపదికన లెక్కించారు !

అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువను ఏ ప్రాతిపదికన లెక్కించారని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నించారు. 2014లో అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ 25 వేల కోట్ల రూపాయలుంటే ఇప్పుడు తక్కువ మొత్తానికి ఎలా పడిపోయిందో బహిరంగపరచాలని విజయవాడలో డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో నేరపరిశోధన విభాగం(సీఐడీ) చంద్రన్న ప్రయోజన విభాగంగా మారిందని ద్వజమేత్తుతూ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఐడీ విచారణ వేసిన ఏ కేసులోనూ పురోగతి లేదని జీవీఎల్‌ దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అక్రమంగా కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారని ఆరోపించారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌కు సైతం ఆస్తుల వేలం విషయంలో లేఖ రాస్తానని తెలిపారు.

అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచేందుకు చేస్తోన్న ధర్మపోరాట దీక్షపై భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈనెల 27న విశాఖపట్నంలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు ఎవరు అన్యాయం చేసినా ఉపేక్షించబోమని, కుటిల ప్రయత్నాలు చేస్తే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.

ఐటీ కంపెనీల సమాచారం ప్రజలకు ఇవ్వమంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని జివిఎల్ ప్రశ్నించారు. ఆదాయ పన్ను శాఖ దాడులపై తెలుగుదేశం నేతలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్ని కుంభకోణాలు, అక్రమాలకు ఆయన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేసారు.

కాగా, అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ లెక్కింపులో అనుమానాలున్నాయని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌ రాజు విశాఖపట్నంలో తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య నాలుగేళ్లుగా నలుగుతోందని చెబుతూ బాధితులకు ఉపశమనం లేకపోగా..రాను రానూ మనోధైర్యం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు బయటకు రాక ముందు కొంతమంది రాజకీయ నేతలు, వారి బినామీలపైన కొనుగోలు చేసిన మాట వాస్తవమని స్పష్టం చేసారు. అందుకే అగ్రిగోల్డ్‌ ఆస్తుల అసలు విలువ ఎంతో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మన ముఖ్యమంత్రి హైటెక్‌ ముఖ్యమంత్రని, ఫిన్‌టెక్‌ కోసం వచ్చారు కానీ అగ్రిగోల్డ్‌ బాధితుల గోడు వినడానికి మాత్రం రాలేదని మండిపడ్డారు.

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం నేటికి మూడున్నర ఏళ్లు అయినా అతీగతీ లేదని బీజేపీ ఎమ్మెల్సీ పివి మాధవ్‌ విమర్శించారు. రిలయన్స్‌, ఎస్‌ఎల్‌ గ్రూప్‌ కంపెనీలు వారి వద్ద అతిచౌకగా కమిషన్‌లను కొట్టే కుట్ర జరగడం వల్ల వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. ప్రభుత్వ కుట్రను బయట పెట్టడానికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు నిరసన దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే న్యాయస్థానం ద్వారా సీబీఐ విచారణ కోరతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.