బీహార్ లో బీజేపీ 17, జేడీయూ 16 స్థానాల్లో పోటీ !

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ పొత్తులపై దూకుడుపెంచింది. దానిలో భాగంగానే ఉత్తర భారతంలో పార్టీకి ఎంతో కీలమైన బిహార్‌లో నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని జేడీయూతో జతకట్టింది. గత కొంతకాలంగా జెడియూ-బిజెపిల మధ్య సీట్ల పంపకంపై ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. దానికి చెక్‌ పెడుతూ లోక్‌సభ సీట్ల విషయంలో రెండు పార్టీలు ఏకభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 17, జేడీయూ 16 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై రెండు పార్టీలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది బీజేపీ మిత్రపక్షమైన లోక్‌ జనశక్తి పార్టీకి ఐదు, ఉపేందర్‌ కుషావా పార్టీకి రెండు సీట్లు కేటాయించినట్లు తెలిసింది.

జేడీయూతో పొత్తు వల్ల సిట్టింగ్‌ స్థానాలకు కూడా బిజెపి కోల్పోవాల్సి వస్తుంది. సీట్ల పంపకాలపై నితీష్‌ కుమార్, అమిత్‌ షాలు ఇదివరికే పలు దఫాలు చర్చించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 22 స్థానాల్లో గెలుపొందగా మిత్ర పక్షాలతో కలుపుకుని 35 స్థానాలకు పైగా సొంతం చేసుకుంది. కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలతో జట్టు కట్టిన జేడీయూ కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. 

అయితే విశాల రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బిజెపి, జెడియూ ఈ నిర్ణయానికి గత నెలలోనే వచ్చిన్నట్లు తెలుస్తున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బిజెపి అద్యక్షుడు అమిత్ షా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ విషయమై ఒక అవగాహనకు వచ్చారని తెలుస్తున్నది. అయితే మిగిలిన భాగస్వామ్య పక్షాలకు కుడా నచ్చచెప్పవలసి ఉన్నందున ఇంకా అధికారికంగా ప్రకటించాలేదని చెబుతున్నారు.