రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబా..నేనా : జగన్

రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబా.. తానా అంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేసారు. ఖజానా ముఖ్యమంత్రి దగ్గర ఉంటుందా ప్రతిపక్ష నేత దగ్గర ఉంటుందా అంటూ నిలదీశారు. బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ఆయునదా.. తనదా అంటూ జగన్ ధ్వజమెత్తారు.

సహాయక చర్యలకు ప్రతిపక్షం అడ్డుపడుతోందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ  తుపాను బాధిత ప్రాంతానికి జగన్ ఎందుకు రాలేదంటూ చంద్రబాబు వివుర్శించడం సిగ్గుచేటన్నారు. బాధితులు నిలదీస్తుంటే ఆ ఫొటోలు తన వెనుక పెట్టుకొని వారు కృతజ్ఞతలు చెబుతున్నారంటూ చంద్రబాబు పబ్లిసిటీ చేసుకొంటున్నారని మండిపడ్డారు.

తుపాను నష్టం రూ. 3,435 కోట్లు అని చెప్పిన చంద్రబాబు ఆ మొత్తం పరిహారాన్ని బాధితులకు అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో వారం రోజుల్లో తాను శ్రీకాకుళంలో కాలుపెట్టి 50 రోజుల పాటు అక్కడే ఉండి పరిహారం కోసం బాధితుల పక్షాన నిలదీస్తానని జగన్ హెచ్చరించారు.

వారం రోజుల ముందు నుంచే తుపాను హెచ్చరికలు వస్తుంటే అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తీరా తుపాను అల్లకల్లోలం సృష్టించిన  తర్వాత తీరిగ్గా అక్కడకు వెళ్లిన చంద్రబాబును బాధిత ప్రజలు తాగునీరు, విద్యుత్ కోసం నిలదీస్తే బుల్డోజర్లుతో తొక్కిస్తానంటూ భయపెట్టారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం బాధితులకు పరిహారం ఇవ్వని పక్షంలో కూడా వారు అధైర్యపడవద్దని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మొత్తం పరిహారాన్ని తామే బాధితులకు నయాపైసాతో సహా అందిస్తామని జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఈ నాలుగేళ్ల పాటు ఆదుకోలేకపోయిందని ధ్వజమెత్తారు.  అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

 రైతు రుణమాఫీ పథకం పేరుతో రైతులను ఆయన మోసం చేశారన్నారు. గత ప్రభుత్వాలు వడ్డీలేని రుణాలు ఇవ్వగా, చంద్రబాబు బ్యాంకులకు వడ్డీ కట్టకుండా ఎగనామం పెట్టారని దుయ్యబట్టారు. దీనివల్ల వడ్డీ లేని రుణాలు రైతులకు అందని పరిస్థితి ఉందన్నారు. జాబ్ కావాలంటే బాబు రావాలంటూ చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశారని ద్వజమెత్తారు.  పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరమని, అది పూర్తయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా నీరందే పరిస్థితి ఉందని తెలిపారు. 

కానీ గడిచిన నాలుగేళ్లలో పోలవరం పునాది గోడలు దాటి ముందుకు పోలేదన్నారు. ప్రాజెక్టును పూర్తిగా అవినీతిమయం చేశారని, ఆ ప్రాజెక్టుకు మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడితో సబ్ కాంట్రాక్టు చేయిస్తున్నారని ఆరోపించారు. పోలవరంలో జరుగుతున్న అవినీతి వల్లనే కేంద్రం నిధులు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చందంగా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వివుర్శించారు. ప్రభుత్వ విద్యను ఆయన సర్వనాశనం చేస్తున్నారని, ప్రతి మున్సిపాలిటీకి నారాయణ, చైతన్య సంస్థలను తీసుకు రావాలని ఆలోచిస్తున్నారని ఆరోపించారు.

హుద్‌హుద్ మీద విజయం సాధించామని గొప్పలు మాత్రం చెప్పుకొన్నారని విమర్శించారు. తిత్లీ తుపాను బాధితులకు కేవలం రూ. 200 కోట్ల సరుకులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని దుయ్యబట్టారు.