రాహుల్ మాటలతో తెలంగాణ ప్రజలు మోసపోరు

రాహుల్ గాంధీ మాటలు విని మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ స్పష్టం చేసారు. కాంగ్రెస్, టి ఆర్ ఎస్  రెండూ దొందూ దొందేనని అంటూ కేసీఆర్ మాటలకు, చేతలకు సంబంధం లేదని ద్వజమెత్తారు.  రాహుల్ మాట్లాడుతున్న విధానం అపరిపక్వత , నిరాశ, నిస్పృహలతో కూడుకున్నట్టుందని విమర్శించారు. అవినీతి బురదలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ నరేంద్రమోదీకి బురద అంటించి చేతులు దులుపుకోవాలని చూస్తోందని దయ్యబట్టారు.

 

మోదీ పాలనలో చిన్నపాటి అవినీతి ఆరోపణలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సహించలేకపోతోందని ఎద్దేవా చేసారు. పదేపదే రాహుల్ గాంధీ రాఫెల్ గురించి మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేయరు.  రాహుల్‌గాంధీ మాట్లాడినపుడు రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ వాటి వివరాలను చెప్పారని, వాస్తవాలను పక్కదారి పట్టించి బీజేపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను రాహుల్ చేస్తున్నారని పేర్కొన్నారు.

 

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, రాహుల్ పర్యటించిన అన్ని ప్రాంతాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిందని అంటూ రాహుల్ గాంధీ నాయకత్వం చేపట్టాక రెండు రాష్ట్రాలకే ఆ పార్టీ పరిమితం అయిందని విమర్శించారు. అస్సాం ఎన్‌ఆర్సీపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏమిటో చెప్పలేకపోతోందని గుర్తు చేసారు. అస్సాంలో ఒక రకంగా, బెంగాల్‌లో మరో రకంగా హైదరాబాద్‌లో ఇంకోరకంగా ద్వంద్వ ప్రమాణాలను అవలంభిస్తోందని తెలిపారు. త్రిపుల్ తలాక్ విషయంలో నిఖా హలాల విషయంలో ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయంపై రాహుల్ గాంధీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.

 

ఇక, సీఎం కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నిందలు వేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ఢిల్లీలో ఉన్నపుడు కేంద్రానికి కితాబు ఇవ్వడం, హైదరాబాద్ వచ్చాక విమర్శలు చేయడం అలవాటుగా మారిందని లక్ష్మణ్ దయ్యబట్టారు.  తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నది వారసత్వరాజకీయాలకు కాదని స్పష్టం చేసారు.  మాట తప్పిన రాష్ట్రప్రభుత్వం తీరుపై బీజేపీ పల్లెపల్లెకూ కార్యక్రమాన్ని ఈ నెల 17 నుండి 26 వరకూ నిర్వహిస్తామని తెలిపారు.