అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా బిజెపి

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉండాలని బిజెపి నిర్ణయించిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి రామమాధవ్ భరోసా ఇచ్చారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడలో బిజెపి చేపట్టిన ధర్మపోరాట దీక్షని ఆయన ప్రారంభించారు. ఇదురోజుల పాటు దీక్ష చేయనున్నారు. బాధితులు దిల్లీ వచ్చి తమను కలిశారని, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. అగ్రిగోల్డ్‌ కుంభకోణం వెనుక ఎవరున్నారో చెప్పాలని రామమాధవ్ డిమాండ్‌ చేశారు.

ఏపీలో త్వరలో ప్రభుత్వం మారుతుందని రామమాధవ్ స్పష్టం చేసారు. వచ్చే ప్రభుత్వంలో బీజేపీ కీలక పాత్ర పోషించబోతోందని జోస్యం చెప్పారు. అవినీతిలో తెలంగాణ రెండు, ఏపీ నాలుగో స్థానంలో ఉన్నాయని దుయ్యబట్టారు. ఎన్నో ఆశలతో తెలంగాణలో టీఆర్‌ఎస్ కు,  ఏపీలో టిడిపికి ప్రజలు అవకాశమిస్తే ఈ రెండు ప్రభుత్వాలూ అవినీతిమయం అయ్యాయని మండిపడ్డారు.

చీటికీ మాటికీ కేంద్రంపై టిడిపి నేతలు అపనిందలు వేస్తున్నారని, అర్ధరహితమైన డిమాండ్లు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయడమే తమ ఆందోళన ఉద్దేశమని చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని, గత మూడేళ్లలో అత్యధిక నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయని రామమాధవ్‌ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో హిట్లర్‌ పాలన నడుస్తోందని, ప్రభుత్వ పాలనపై ప్రశ్నించే వారిని రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. చంద్రబాబు మనుషులు అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకుంటున్నారని దయ్యబడుతూ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కారణంగానే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగిందని ద్వజమెత్తారు. రూ3 వేల కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్‌ను లోకేష్‌ రూ 270 కోట్లకు కాజేయాలని చూశారని విమర్శించారు.

లోకేష్‌ అడిగిన ధరకు ఇవ్వలేదని వారిని ఇబ్బంది పెడుతున్నారని కన్నా ఆరోపించారు. . అగ్రిగోల్డ్‌ యాజమాన్యం, టీడీపీ ప్రభుత్వం కుమ్మక్కై 3 లక్షల మంది బాధితులను ఇబ్బందిపెడుతున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తుల లెక్కలు చెప్పమంటే సంవత్సరానికి ఒక లెక్క చెబుతున్నారని, అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను కావాలనే తగ్గించారని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రూ.500 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి యనమల రామకృష్లుడు స్వయంగా చెప్పారనే విషయాన్ని ఈ సందర్భంగా కన్నా గుర్తు చేశారు. ఆ తరువాత కేవలం రూ.6 లక్షలే ఉన్నాయని మాట మార్చారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని, విజయవాడలో రూ.30 కోట్లున్న ఆస్తులను కేవలం రూ.11 కోట్లకే ఇచ్చేశారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేవరకు బీజేపీ అండగా ఉంటుందని కన్నా హామీ ఇచ్చారు.

ఇలా ఉండగా, అమరావతిని ల్యాండ్ మాఫియాగా మార్చిన ఘనత చంద్రబాబుదే అని బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు విమర్శించారు. అమరావతి భూములను టీడీపీలోని ల్యాండ్‌ మాఫియా కారు చౌకగా కొట్టేసిందని ద్వజమెత్తారు. టీడీపీ ఎంపీలే టెండర్లు వేసి వారే కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే అందినకాడికి దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రూ 1.50లక్షల కోట్లు అప్పులు తెచ్చారని చెబుతూ వాటికి లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్‌లో లక్షల మంది దాచుకున్న డబ్బు దోచుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఏపీలో లాలూ ప్రసాద్‌ తరహా ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. బీహార్‌లో ఆర్జేడీకి వచ్చిన పరిస్థితే ఏపీలో టీడీపీకి రానుందని పేర్కొన్నారు. ఆరు నెలల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఉండదని..అన్నింటిపై విచారణ జరిపిస్తామని జీవీఎల్ స్పష్టం చేశారు.