భారతీయ సమాజంలో హింసకు తావులేదు

భారతీయ సమాజంలో హింసకు తావులేదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పష్టం చేశారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ దీర్ఘకాలిక లక్ష్య సాధనలో దేశం ముందడుగు వేస్తున్న ప్రస్తుత సమయంలో వివాదాస్పద అంశాలు, అసందర్భపు చర్చల జోలికి పోవద్దని పిలుపునిచ్చారు. హింస కన్నా అహింస అత్యంత శక్తివంతమైనదని తెలిపారు.

 

'చేతిని విసరటం కన్నా చేతిని నిలుపుకోవటమే గొప్ప' అని, హింసకు సమాజంలో స్థానం లేదని కోవింద్‌ పునరుద్ఘాటించారు. మహిళలు తాము కోరుకున్న రీతిలో జీవనాన్ని కొనసాగించవచ్చని, వారి సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు అవసరమైన చేయూతనందించి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. దేశ ప్రజల కోసం వేలాది టన్నుల ఆహారధాన్యాలను పండిస్తున్న రైతులు ఆహార భద్రత కల్పించటం ద్వారా మన స్వాతంత్య్రాన్ని పరిరక్షిస్తూ పోషకాహారాన్ని అందిస్తున్నారని కొనియాడారు.

 

రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి సహకరిస్తే వారు పంటలను మరింత బాగా పండించి ఎక్కువ ఆదాయాన్ని పొందగలరని రాష్ట్రపతి సూచించారు. మనం స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో ముందడుగు వేయాలని ఆయన అన్నారు. ఎంతోకాలం నుంచి నిరీక్షిస్తున్న అనేక లక్ష్యాలను మన దేశం సాధించబోతున్న కీలక తరుణంలో వివాదాస్పద అంశాలు, అన్యమైన విషయాలపై చర్చలతో అభివృద్ధి పథాన్ని వీడొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హితవు పలికారు.

 

‘చరిత్రలో ఇంతవరకు మనమెన్నడూ చూడని కీలకమైన కూడలిలో ఇప్పుడున్నాం. బహిరంగ మల విసర్జనకు స్వస్తి పలకడం, అత్యంత పేదరిక నిర్మూలన, అందరికీ విద్యుత్తు/ ఇళ్లు, వంటివెన్నో సాధించుకుంటున్నాం. కీలకమైన దశకు చేరిన తరుణంలో మన పథాన్ని మళ్లించే అన్యమైన విషయాలపై దృష్టి సారించనేవద్దు. క్యూలో నిల్చొన్నప్పుడు తన కంటే ముందున్న వారి హక్కులను గౌరవించడం తెలిసిన ప్రతీ భారతీయుడూ మన దేశ స్వాతంత్య్ర సంగ్రామ సిద్ధాంతాలకు అనుగుణంగా జీవిస్తున్నట్లే. అందరం దీనికి కట్టుబడదాం’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

 

సాటి పౌరులకు ఆహార భద్రత కల్పిస్తున్న రైతుల నుంచి ఉగ్రవాదులతో పోరాడుతున్న భద్రత బలగాల వరకు దేశానికి ఎందరో సేవలందిస్తున్నారని కోవింద్‌ కొనియాడారు. వైద్యులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వ్యాపారవేత్తలు మొదలుకొని చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేసే భారతీయులందరూ స్వాతంత్య్ర విలువల పరిరక్షకులేనని చెప్పారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, వేసే పునాదులు- మన దేశం ఎక్కడ ఉండాలనేది నిర్ణయిస్తాయన్నారు.

 

 ‘దేశంలో అభివృద్ధి, మార్పులు ప్రజా భాగస్వామ్యంతో శరవేగంగా, ప్రశంసనీయంగా చోటు చేసుకుంటున్నాయి. సమాజంలో మహిళల స్వేచ్ఛను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. తమ అభిమతాన్ని అనుసరించి ముందుకు వెళ్లేలా, అలాంటి హక్కు వారికి కల్పించేలా చూడాలి. విద్య ఫలితం కేవలం డిగ్రీలు, డిప్లమోలు సాధించడం కాదు. అది మరొకరి జీవితాన్ని మెరుగుపరిచేదిగా ఉండాలి. అదే సహానుభూతి. అదే సౌభ్రాతృత్వం. అదే భారతదేశం. భారత్‌ అంటే కేవలం ప్రభుత్వానిదే కాదు... దేశ ప్రజలది’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.