మహాకూటమికి టీజేఎస్, సీపీఐ గుడ్ బై !

టీఆర్ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న మహాకూటమిలో పొత్తులు, సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టీఆర్ఎస్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడినప్పటికీ సీట్ల సర్దుబాటు విషయంలో పార్టీల నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మహాకూటమికి తెలంగాణ జన సమితి (టీజేఎస్) షాక్ ఇచ్చింది.

మహాకూటమికి టీజేఎస్ గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. టీజేఎస్ దారిలోనే సీపీఐ కూడా ఉన్నట్టు తెలిసింది. సీట్ల సంఖ్య కాదు ముఖ్యమని, కాంగ్రెస్ నేతల అవమానాన్ని భరించలేక పోతున్నామని ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. ఆదివారం జరిగిన సీపీఐ రాష్ట్ర కమిటి సమావేశంలో నాయకత్వంపై నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్త పరిచినట్టు తెలిసింది.

తమకు 16 సీట్లు ఇవ్వాలని టీజేఎస్ పట్టుబడుతుంటే, 8 నుంచి 10 సీట్లు కావాలని సీపీఐ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. లేదంటే ఒంటరిగానైనా బరిలోకి దిగుతామని రెండు పార్టీల నేతలు తెగేసి చెబుతున్నాయి.

అయితే టీజేఎస్ కు 8 సీట్లు, సిపిఐకి మూడు సీట్లకు మించి ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నెల 24న జరిగే తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటి సమావేశంలో  మహాకూటమిలో ఉండాలా వద్దా అన్న అంశంపై తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీజేఎస్, సీపీఐల కన్నా టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టపడుతున్నట్టు చెబుతున్నారు.

మరోవంక, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణాలోని పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో భేటీ అయి పొత్తుల గురించి సమాలోచనలు జరిపారు. టిడిపికి 30సీట్లు కావాలని గతంలో కాంగ్రెస్‌కు రాష్ట్ర నేతలు ప్రతిపాదనలు ఇచ్చారు. కానీ అందులో సగమే ఇవ్వడానికి కాంగ్రెస్‌ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా టిడిపి అడిగిన స్థానాల్లో కాకుండా కొన్ని ఇతర చోట్ల ఇస్తామని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్‌తో పొత్తు ముఖ్యమని, సీట్ల విషయంలో సర్దుకుపోవాలని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ 12 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, మరో 6 సీట్లు అడుగుదామని సూచించారు. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌ పెద్దలతో మాట్లాడుతానని నేతలకు బాబు తెలియజేశారు.