`రాజకీయ ఉనికి’ కోసం కాంగ్రెస్ ముందు చంద్రబాబు దాసోహం !

రాజకీయ అవసరాల కోసం ఎన్డియే నుండి వైదొలగిన తర్వాత రాజకీయంగా ఏకాకిగా మారిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసం తప్పని సరి పరిస్థితులలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టిఆర్ ఆశయాలకు ఘోరి కట్టించి కాంగ్రెస్ తో చేతులు కలపడం తెలిసిందే. తెలంగాణాలో సొంతంగా పోటీ చేసే ధైర్యం లేక, అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ తో పొట్టు కోసం ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విముఖత వ్యక్తం చేయక పోవడంతో కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దమయ్యారు.

పొత్తుల విషయంలో తెలంగాణలోని పార్టీ నాయకత్వం నిర్ణయానికే వదిలివేసిన్నట్లు పైకి చెప్పుకుందా, ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టి రామారావు కాలం నుండి నాయకులు విముఖత వ్యక్తం చేసినా, వారందరినీ పట్టించుకోకుండా కాంగ్రెస్ తో చేతులు కలిపారు. తెలంగాణలో పెద్దగా బలం లేని సిపిఐ, తెలంగాణ జన సమితి నేతలు సహితం సీట్ల కోసం కాంగ్రెస్ తో వాదనలకు దిగుతుంటే టిడిపి నేతలు మాత్రం నోరు విప్పడం లేదు. పైగా ఆగ్రహంతో భేటి నుండి బైటకు వెళ్ళిపోవడానికి సిద్దమైన కోదండరామ్ వంటి వారిని ఓదార్చి కుర్చునేటట్లు కుడా టిడిపి నాయకులు చేయడమే గమనార్హం.

గత ఎన్నికలలో టిడిపి గెలుపొందిన సీట్లు, ఇప్పటికి బలమైన టిడిపి నాయకత్వం ఉన్న నియోజకవర్గాలలో కాంగ్రెస్ నేతలు పోటీకి సిద్దపడుతుంటే, గెలిచే అవకాశం లేని సీట్లు మాత్రమె ఇస్తామని అంటుంటే కుడా టిడిపి నాయకులు గట్టిగా మాట్లాడలేక పోతున్నారు. “మనకు కావలసింది సీట్లు కాదు కాంగ్రెస్ తో నేస్తం” అనే సందేశాన్ని చంద్రబాబు తమ పార్టీ నేతలకు ఇచ్చిన్నట్లు స్పష్టం అవుతున్నది.

ఈ పొత్తు తెలంగాణకే పరిమితమని అంటూ ఆంధ్ర ప్రదేశ్ లోని పలువురు టిడిపి నేతలు మొదట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ తో కలసి పోటీ చేయవలసి వస్తే `ఆత్మహత్య’కైనా సిద్దమే కాని ఆ పార్టీతో కలిసే ప్రసక్తి లేదని అంటూ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణముర్తి వంటి వారు బహిరంగంగానే స్పష్టం చేసారు. అయితే తెలుగు దేశం బలహీనతలను ఆసరా చేసుకొని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు ఆ పార్టీ పై స్వారీ చేసే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణలో పొత్తు కొనసాగాలి అంటే ముందుగా ఎపిలో తమతో పొత్తు ఉండవలసిందే అని స్పష్టం చేస్తున్నారు.

ఎపిలో ప్రస్తుతం కాంగ్రెస్ సొంతగా ఒక్క సీట్ కుడా గెలిచే పరిస్థితులలో లేదు. అందుకనే తమ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఐదారు మందైనా తప్పని సరిగ్గా లోక్ సభకు గెలిచే విధంగా అక్కడ తమకు సీట్లు ఇస్తేనే తెలంగాణలో సీట్లు ఇస్తామని షరతు పెడుతున్నారు. కాంగ్రెస్ షరతులకు దాసోహం కావడం మినహా చంద్రబాబుకు గత్యంతరం కనిపించడం లేదు. తెలంగాణలో సీట్లు సర్దుబాటు ఖరారు అయ్యే లోగానే ఎపిలో ఏడు లోక్ సభ సీట్లు, కనీసం 20 అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ కు ఇచ్చేటట్లు హామీ తీసుకున్నట్లు తెలుస్తున్నది.

ఒక వంక తెలంగాణలో టిడిపితో పొత్తు ద్వారా ఇక్కడ నివాసం ఉంటున్న ఎపి ప్రాంతానికి చెందిన వారి ఓట్లు తమకు పడేటట్లు చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్, ఎపిలో సహితం టిడిపి నీడలో నాలుగు సీట్లు గెలుపొందేటట్లు చేసుకొనే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నది. తమ పొత్తు తెలంగాణకు పరిమితం కాదని, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండాలని కాంగ్రెస్ పెడుతున్న షరతును చంద్రబాబు దిక్కరించలేని నిసాహాయ స్థితిలో ఉండటం టిడిపి వర్గాలకే విస్మయం కలిగిస్తున్నది.

ఇప్పటికే కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలపడాన్ని టిడిపి కార్యకర్తలు అనేకమంది సహించలేక పోతున్నారు. ఇప్పుడు రెండు పార్టీలు ఉమ్మడి ప్రచారం చేయాలని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. వీలును బట్టి రాహుల్, చంద్రబాబు కలసి కొన్ని సభలలో ప్రసంగించాలని కుడా పట్టుబడుతున్నారు. అప్పుడే రెండు పార్టీల పొత్తు పట్ల ప్రజలలో విశ్వాసం కలుగుతుందని చెబుతున్నారు. ఇప్పటి దాకా ఈ పొత్తుతో తనకు సంబంధం లేన్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబును కాంగ్రెస్ వైపు నుండి వస్తున్న వత్తిడులు మరింతగా ఇరకాటంలో పడవేస్తున్నట్లు వెల్లడి అవుతున్నది.

అదే విధంగా రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ తెలుగు ప్రజలకు ద్రోహం చేసినదంటూ చంద్రబాబు విమర్శలు చేయడం కుడా మానుకోవాలని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. తన ప్రభుత్వంలో జరిగిన, జరుగుతున్న అక్రమాలు, అవినీతి చర్యల గురించి బిజెపి నేతలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్న సమయంలో కాంగ్రెస్ అండ అవసరమని భావిస్తున్న చంద్రబాబుకు వారి వత్తిడులకు దాసోహం కావడం తప్ప మరో దారి కనిపించడం లేదు.