లక్ష్మణ్‌ కాబోయే ముఖ్యమంత్రి : రాంమాధవ్‌

వచ్చే ఎన్నికల అనంతరం తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి బిజెపి రాష్ట్ర అద్యక్షుడు డా. కె లక్ష్మణ్ మాత్రమె అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ ప్రతిపక్షంలో ఉండదు... కచ్చితంగా అధికార పక్షంలోనే ఉంటుందని స్పష్టం చేసారు. “మేం లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం అసాధ్యమ’’ని భరోసా వ్యక్తం చేసారు. లక్ష్మణ్‌ను కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా ముఖ్యమంత్రిగా చూడాలని తాను భావిస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో బీజేపీ గెలిస్తేనే హైదరాబాద్‌ ప్రజలకు రక్షణ ఉంటుందని, లేకపోతే ఇబ్బందులు తప్పవని అన్నారు.

తెలంగాణలో తొలి విడతగా 38 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించగానే మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల సమావేశాల్లో రాంమాధవ్‌ పాల్గొంటూ తెలంగాణ ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని తెలిపారు. అందరికంటే ముందు తెలంగాణ జెండాను పైకెత్తిన పార్టీ బీజేపీ అని, 1997-98 నుంచి పోరాటం చేసిందని గుర్తు చేసారు.

రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం ఉందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు విజన్‌ లేదని, ఆయన కుటుంబ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకోరని నిప్పులు చెరిగారు. అందుకే, బంగారు తెలంగాణగా అవతరించడానికి రాష్ట్రానికి అన్ని అర్హతలున్నా వెనుకబడిపోయిందని ఆరోపించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు 50 సీట్లు వస్తే చాలా ఎక్కువ వచ్చినట్లు అని స్పష్టం చేసారు. అయిదేళ్లపాటు పూర్తిగా పాలిస్తే తమ అక్రమాల గురించి ప్రజలు ఎక్కడ నిలదీస్తారోననే భయంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ధ్వజమెత్తారు.

బీజేపీ అంటే అభివృద్ధి అని, టీఆర్‌ఎస్‌ అంటే అవినీతి అని పేర్కొన్నారు. నాలుగేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుని, ప్రజలు ఎక్కడ లెక్కలు అడుగుతారోనన్న భయంతో టీఆర్‌ఎస్‌ జెండా ఎత్తేసిందని విమర్శించారు. అవినీతిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని సీఆర్‌ఎస్‌ సర్వే వెల్లడించిందని గుర్తు చేసారు. “ నేను... నా కొడుకు... నా కూతురు” అన్నట్టు కేసీఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. బంధుప్రీతి అని అంటుంటారు... కానీ ఇక్కడ మాత్రం కొడుకు, కూతురు ప్రీతి ఉందని ద్వజమెత్తారు.

ఐదేళ్లలో బంగారు తెలంగాణ చేస్తానని నమ్మబలికిన ఆయన నాలుగేళ్లకే దుకాణం బంద్‌ చేశారని విమర్శించారు. ‘‘ఆయన మాత్రం బంగారు ఇల్లు కట్టుకున్నారు. ఆయన ఇల్లు బంగారంతో నిండిపోయింది. ఆయన కుటుంబమే బంగారు కుటుంబమైంది. తెలంగాణ మాత్రం దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది’’అని ఆరోపించారు. దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ టీఆర్‌ఎస్‌ అని విమర్శించారు.

ఎవరో వెన్నుపోటు పొడుస్తారని కేసీఆర్‌ ఒక్కనాడూ సచివాలయానికి వెళ్లలేదని విమర్శించారు. సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం పది రోజులుగా ఎదురుచూస్తున్నానని హోంమంత్రే చెప్పారని గుర్తు చేశారు. పేరు, రంగు మాత్రమే మారిందని, అదే కాంగ్రెస్‌ సంస్కృతి, అదే అవినీతి, అదే కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ విచిత్రమైన పార్టీ అని, మోదీ నిధులు ఇస్తుంటే అవి ఎక్కడకు పోతున్నాయో తెలియడం లేదని ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం 1.15 లక్షల కోట్లు ఇచ్చిందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరో రెండు లక్షల కోట్లు పైబడి అప్పులు చేసిందని చెప్పారు. నాలుగేళ్లలో మూడున్నర లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని నిలదీశారు. వెనుకబడిన రాష్ట్రాల్లో రోడ్లపై గుంతలు ఉండడం ఆశ్చర్యం కాదని, కానీ తెలంగాణలో గుంతల మధ్య రోడ్లు ఉన్నాయి అని ఎద్దేవా చేశారు.

కాగా, టీడీపీ... తెలుగు ద్రోహుల పార్టీగా మారిందని రాంమాధవ్‌ ద్వజమెత్తారు. ఏ కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారో అదే కాంగ్రె్‌సతో ఇప్పుడు జత కట్టిందని, డబ్బు సంచులు పంపిస్తోందని ఆరోపించారు. అవినీతిపరులను పట్టుకుంటే కక్ష సాధింపు అంటున్నారని ఎద్దేవా చేసారు. ఢిల్లీలో మోదీ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని గుర్తించాలని, ఎవర్నీ వదిలిపెట్టే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు.

మోదీని అవినీతిలో దింపేశక్తి ప్రపంచంలో పుట్టలేదని రాంమాధవ్‌ ధీమా వ్యక్తం చేసారు.  బెయిలుపై తిరుగుతున్న రాహుల్‌ గాంధీ మోదీని విమర్శించడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. అత్యంత పారదర్శకంగా రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు జరిగిందని చెప్పారు. కరడుగట్టిన మతతత్వ పార్టీ అయిన మజ్లి్‌సతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. వారికి బీజేపీని మతతత్వ పార్టీ అనే హక్కు ఉందా?అని ప్రశ్నించారు.