29న తిత్లీ బాధితులకు చెక్కులు

తిత్లీ తుపాను బాధితులకు ఈ నెల 29న నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తుపాను సహాయక చర్యలపై ప్రజల్లో సంతృప్తి శాతం 61శాతానికి పెరిగిందని, త్వరలో తిత్లీ ఉద్దానం రీకన్‌స్ట్రక్షన్ ప్రోగ్రామ్ యూనిట్ (తూర్పు)ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తుపాను సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయని అంటూ అన్ని పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

చెక్కు అందించిన మరుక్షణం బాధితుల బ్యాంకు ఖాతాలో సొమ్ము జమయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బాధితుడు ఇల్లు, పొలం, తోటను నష్టపోయినా వాటన్నింటినీ కలిపి లెక్కించి ఒకే చెక్కును అందిస్తారు. పరిహారానికి అర్హుల జాబితాను సోమవారం గ్రామపంచాయతీల్లో, బహిరంగ ప్రదేశాల్లో ప్రకటిస్తారు. 25వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 27న చివరిగా అర్హుల జాబితాను ప్రకటిస్తారు.

దాదాపు 92 వేల హెక్టార్లలో పంట నష్టానికి సంబంధించి 2.17 లక్షల రైతులకు పరిహారం అందించాల్సి ఉంది. ఇప్పటివరకు 32 వేల హెక్టార్లకు సంబంధించి 64 వేల రైతుల పేర్లను మాత్రమే నమోదు చేశారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి 18,500 మంది బాధితులకుగాను ఇంకా నాలుగువేల పైచిలుకు నమోదు కావాల్సి ఉంది. ఉద్యానశాఖకు సంబంధించి 50 వేలమంది బాధితులకుగాను సగానికిపైగా నమోదు పూర్తయింది. ఇందులోనే కొబ్బరిచెట్ల నష్టం అంచనాలున్నాయి.

దేవాదాయ శాఖకు చెందిన భూములతోపాటు ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుని నష్టపోయినవారికీ సాయం అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. సహాయక పనుల్లో అసాధారణ సామర్థ్యం చూపారని, బాగా కష్టపడి పనిచేసిన వారికి ఈ నెల 29న అవార్డులు ఇచ్చి సత్కరించనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. హుదూద్ సమయంలో కన్నా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారని కొనియాడారు. ప్రజల ప్రశంసలే అసలైన అవార్డులని, ఆదివారం అన్ని శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని ఆయన తెలిపారు. విద్యుత్ పనులపై 50 శాతం, వైద్య సౌకర్యాలపై 73 శాతం సంతృప్తి వ్యక్తమైందన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 61శాతం మేర ప్రజాసంతృప్తి వ్యక్తమైందని, దీన్ని 76శాతానికి తీసుకెళ్లటం లక్ష్యమని చెప్పారు.

అన్ని పనులు పూర్తిచేశాకే ఎవరైనా తిరిగి వెళ్లేదని, చివరికి వచ్చాం కదా అని అలక్ష్యం చేయొద్దని సూచించారు. ఈ రెండు రోజులు కష్టపడితే మన శ్రమకు సార్థకత చేకూరుతుందని వ్యాఖ్యానించారు. ఏ గ్రామానికి ఎంత నష్టం వచ్చింది? ఎంత సహాయం అందించిందీ గ్రామసభల్లో ప్రకటించాలని చెప్పారు. గతంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అందరూ కలిసి పంచుకునేవారని అంటూ ఇటీవల రాజకీయాల వల్ల పెడధోరణలు పెరిగాయని విచారం వ్యక్తం చేసారు.

అభివృద్ధిపై అంతటా సానుకూలత ఉండాలని, పునర్నిర్మాణంలో అందరూ తలో చేయి వేయాలని కోరారు. 101 సబ్ స్టేషన్లు చార్జింగ్ చేశారని, 71 నీటి పథకాలు పని చేస్తున్నాయన్నారు. మరో 288 నీటి సరఫరా పథకాలు అందుబాటులోకి రావాల్సి ఉందని చెప్పారు. అవసరం లేనిచోట్ల ఉన్న జనరేటర్లను ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.  34,120 విద్యుత్ స్తంభాల ఎర్పాటు భగీరథ ప్రయత్నమేనని, ఇందుకు 9952 మంది శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

భోజన సదుపాయాలపై ప్రజల నుంచి 73శాతం సంతృప్తి వ్యక్తమైందన్నారు. పబ్లిక్ ప్రాంతాల్లో కూలిన చెట్ల తొలగింపు పనులు సోమవారం నాటికి పూర్తి చేయాలన్నారు. హార్టికల్చర్, చిన్న దుకాణాలు, ఇళ్ల నష్టం వివరాల సేకరణ సోమవారం నాటికి పూర్తి చేయాలన్నారు. 29న అందరికీ చెక్కులు పంపిణీ చేసి, తరువాత ‘తూర్పు’ కార్యక్రమం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.