రూపాయి విలువ పతనంతో ఆందోళన వద్దు !

అమెరికా డాలర్ బలపడడంతో పాటు, టర్కీ కరెన్సీ లీరా పతనంతో మంగ ళవారం రూపాయి మారకం విలువ ఒకదశలో కొత్త కనిష్ఠ స్థాయి రూ. 70.10కి పతనం అయింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుని నాలుగు పైసల లాభంతో చివరికి రూ. 69.89 వద్ద ముగిసింది. అయితే, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనానికి పూర్తిగా అంతర్జాతీయ పరిణామాలే కారణమని కేంద్ర ఆర్థికవ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. మిగతా దేశాల కరెన్సీలతో పాటే రూపాయి విలువ పతనం అవుతున్నంత కాలం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి పతనం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గార్గ్ చెప్పారు. రూపాయి పతనం అవుతున్న స్థాయిలోనే మిగతా కరెన్సీలు క్షీణిస్తుంటే ఆందోళన అవసరంలేదన్నారు. కొన్ని కరెన్సీల కన్నా మన రూపాయి విలువ తక్కువగానే పతనం అయిందని గుర్తు చేసారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ 6.7 శాతం కోల్పోయింది. రూపాయి పతనం కేవలం అంతర్జాతీయ పరిణామాల కారణంగానే జరుగుతు న్నందున సరిపడా విదేశీ మారక నిల్వలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రిజర్వ్‌బ్యాంక్ జోక్యం చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదని పేర్కొన్నారు.

ఆగస్టు 3వ తేదీతో ముగిసిన వారాంతానికి 402.7 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు వున్నాయి. దేశంలోకి వస్తున్న పెట్టుబడుల సంఖ్యను బట్టి చూస్తే రూపాయి మారకం విలువ రూ. 69 నుంచి రూ 70 మధ్య స్థిరపడే అవకాశం ఉందని ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీష్‌కుమార్ తెలిపారు  టర్కీ సంక్షోభం నేపథ్యంలో వర్ధమాన దేశాల కరెన్సీల పతనమే రూపాయి పతనానికి ప్రధాన కారణమని ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన ప్రసన్న చెప్పారు.