సీట్ల సర్దుబట్లపై `మహాకుటమి’లో కుమ్ములాటలు

మహాకుటమి లోని పార్టీలకు మొక్కుబడిగా సీట్లు ఇచ్చి, మిగిలిన అన్ని సీట్లకు తామే పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ పెద్దన్నగా వ్యవహరించే ధోరణి పట్ల ఆయా పార్టీలలో అంతర్గతంగా కుమ్ములాటలకు దారి తీస్తున్నది. సిపిఐ కి రెండు లేదా మూడు సీట్లకు మించి ఇవ్వడానికి సిద్దపడటం లేదు. కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితికి 8 సీట్లకు మించి ఇవ్వడానికి సిద్ద పడటం లేదు. ఇక తెలుగు దేశంకు 10 నుండి 12 సీట్లకు మించి ఇవ్వలేమని చెప్పేస్తున్నారు.

పైగా తమకు బలమైన అభ్యర్ధులు లేని, కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేని, టీఆర్ఎస్ లేదా బిజెపిలకు బలమైన అభ్యర్ధులు ఉంది, గెలిచే అవకాశాలు ఉన్న సీట్లను మాత్రమె మిత్ర పక్షాలకు కాంగ్రెస్ ఇవ్వజుపుతున్నది. ఎన్నికల అనంతరం తాము ప్రభుత్వం ఏర్పాటు చేసినా సొంత బలంపై ఏర్పాటు చేయాలనీ, మరో పార్టీ అవసరం ఉండకూడదనే అభిప్రాయంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.

దానితో తమకు గెలుపొందే అవకాశాలు లేని సీట్లను మాత్రమె ఇవ్వడానికి సిద్దపడుతున్నదని కాంగ్రెస్ పై మిత్రపక్షాలు భగ్గుమంటున్నాయి. పిసిసి అద్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి తను ముఖ్యమంత్రి కావడం కోసం ఒక వంక కాంగ్రెస్ పార్టీలో సేనియర్లను కట్టడి చేస్తూ, మరోవంక మిత్ర పక్షాలను సహితం కొంచెం దూరంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి.

కాంగ్రెస్ తీరుపై తెలంగాణ జనసమితి సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనది. టీజేఎస్‌కు ఇస్తామంటోన్న సీట్ల విషయంలో కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనలపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీజేఎస్ కోర్ కమిటీలో ముఖ్యమైన నేతలు అందరికి, 12కి ఖచ్చితంగా సీట్లు ఇస్తేనే పొత్తు కుదుర్చు కోవాలని, లేని పక్షంలో ఇతర మార్గాలు అనుసరించాలని వత్తిడి చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రతిపాదనలు తమకు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేస్తున్నారు. ఈనెల 24న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహింఛి పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ దారికి రాని పక్షంలో సిపిఎం, ఇతర ప్రజా సంఘాలతో అవగాహన కుదుర్చుకోవాలని నిర్ణయానికి వచ్చారు.

కాగా, సిపిఐ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తలలు పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర కార్యవర్గం అత్యవసర భేటీలో కాంగ్రెస్ ఇచ్చే రెండు మూడు సీట్లు తమకొద్దంటూ కార్యవర్గ సభ్యులు స్పష్టం చేశారు. అవసరమైతే ఒంటరిగా పోటీ చేయాలని సభ్యుల ఆందోళనకు దిగారు. కార్యవర్గ భేటీ నుంచి మాజీ ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు అలిగి వెళ్లిపోయారు.

టిడిపిలో సహితం కాంగ్రెస్ ధోరణి పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతున్నారు. కాంగ్రెస్ లో పలుకుబడి గలిగిన నాయకుల కోసం గత ఎన్నికలలో తాము గెలిచిన, తమకు బలం గల సీట్లను కుడా ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ద పడక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.

నగరంలోని మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున మండలి రాధాకృష్ణ యాదవ్‌కు టికెట్ కేటాయించాలంటూ ఆయన అనుచరులు పార్టీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద  ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నివాసానికి వెళ్లి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు అడ్డుపడి వారిని అక్కడినుంచి పంపించేశారు.